ఎదురీదుతున్న వనామీ.. భారీ వర్షాలతో వైరస్‌ల ముప్పు

15 Sep, 2022 20:08 IST|Sakshi
భీమవరం మండలం నాగేంద్రపురంలో వైరస్‌ సోకడంతో రొయ్యలు పట్టుబడి చేస్తున్న దృశ్యం

భీమవరం అర్బన్‌: ఈ ఏడాది వనామీ రొయ్య గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. జూన్‌ నెల నుంచి భారీ వర్షాలు పడుతుండటంతో రొయ్యల పెంపకం రైతుకు కత్తిమీద సాములా మారింది. చెరువులలో వనామీ రొయ్య పిల్లలు వదిలిన 15 రోజుల నుంచి నెల రోజుల లోపే వైట్‌ స్పాట్, విబ్రియో వంటి వైరస్‌లు సోకి చనిపోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, కాళ్ల, ఉండి, వీరవాసరం, మొగల్తూరు, నరసాపురం, ఆచంట, పాలకోడేరు తదితర మండలాల్లో సుమారు 75 వేల ఎకరాలలో వనామీ రొయ్యల పెంపకం చేస్తున్నారు.

ఏడాదికి జిల్లా నుంచి 2 లక్షలకు పైగా టన్నులు చైనా, సింగపూర్, దక్షిణకొరియా, అమెరికా తదితర దేశాలకు ఎగుమతవుతున్నాయి. రూ.7 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని మత్స్యశాఖ అధికారుల అంచనా. వనామీ రొయ్యలు 2 నుంచి 3 నెలలు మధ్య పట్టుబడికి వస్తే లాభాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఎక్కువ మంది రైతులు ఈ రొయ్యలను పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు.  

అధిక వర్షాలతో వైరస్‌ల ముప్పు 
జూన్‌ నుంచి ఎడతెరిపి లేని వర్షాలతో వనామీ రొయ్యల పిల్లలకు వైట్‌స్పాట్, విబ్రియో వంటి వైరస్‌లు సోకడంతో నెల రోజులు లోపే మృత్యువాత పడుతున్నాయి. దీంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు చెబుతున్నారు. కొంతమంది రైతులు ప్రత్నామ్నాయ మార్గాలైన పండుగొప్ప, శీలావతి చేపలు పెంచుతున్నారు. (క్లిక్ చేయండి: అక్కడ చెట్లకు డబ్బులు కాస్తాయ్‌!)

భారీగా పెరిగిన రొయ్య ధరలు 
గత మూడు నెలలుగా జిల్లాలో పట్టుబడికి వచ్చిన కౌంట్‌ రొయ్యలు తక్కువగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి రొయ్యలకు ఆర్డర్లు రావడంతో రొయ్య ధరకు రెక్కలు వచ్చాయి. 100 కౌంట్‌ రూ.280, 90 కౌంట్‌ రూ.290, 80 కౌంట్‌ రూ.310, 70 కౌంట్‌ రూ.330, 60 కౌంట్‌ రూ. 340, 50 కౌంట్‌ రూ.360, 45 కౌంట్‌ రూ.370, 40 కౌంట్‌ రూ.400, 30 కౌంట్‌ రూ. 450, 25 కౌంట్‌ రూ.540 ధర పలుకుతుంది. రొయ్యల వ్యాపారస్తులు దూరం, టన్నుల మేరకు ధరలు మారుతున్నారు. 


వర్షాలతో రొయ్యకు వైరస్‌  

అధిక వర్షాల కారణంగా వనామీ రొయ్యకు వైట్‌స్పాట్, విబ్రియో వైరస్‌లు సోకడంతో సీడ్‌ దశలోనే మృత్యువాత పడుతున్నాయి. కౌంట్‌కు వచ్చిన రొయ్యలు పట్టుబడులు లేకపోవడంతో రొయ్యల ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో రొయ్యకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయి.  
– ఎల్‌ఎల్‌ఎన్‌ రాజు, ఏడీ, మత్స్యశాఖ, భీమవరం
   

ధరలు ఒకేలా ఉండేలా చూడాలి 

రొయ్యలకు వేసే 25 కేజీల మేత రూ.2500 అయింది. ఎండాకాలంలో రొయ్యల ధరలు అమాంతం తగ్గిస్తున్నారు. అన్‌ సీజన్‌లో రొయ్యల ధరలు పెంచుతున్నారు. వనామీ పెంపకంలో ఎక్కువ నష్టాలు వస్తున్నాయి. సన్న, చిన్నకారు రైతులు చేపల పెంపకం చేస్తున్నారు. ఎప్పుడూ రొయ్యల ధరలు ఒకేలా ఉండేలా చూసి రైతులను ఆదుకోవాలి. 
– జడ్డు రమేష్‌ కుమార్, రైతు, గూట్లపాడురేవు

మరిన్ని వార్తలు