లక్ష పిడకలతో 'భోగి'

5 Jan, 2021 08:38 IST|Sakshi
తయారుచేసిన భోగి పిడకలు చూపిస్తున్న మహిళలు

మురపాకలో లక్ష ఒక్క పిడకల బోగి పండగ

సంప్రదాయాలను బతికించాలన్న తలంపుతో కార్యక్రమం

వీధివీధినా వెలిగే భోగి మంటల్లో ఎన్ని నులివెచ్చని జ్ఞాపకాలు దాగుంటాయో కదా. కర్రల వేట నుంచి బోగి రాత్రి జాగారం వరకు చేసిన పనులు, పోగు చేసిన అనుభూతులు గుండె గదిలో శాశ్వతంగా నిలిచిపోయి ఉంటాయి. కానీ నేటి తరం అలాంటి జ్ఞాపకాలు మూటగట్టుకోవడంలో విఫలమవుతోంది. కృత్రిమ రీతిలో పండగలు నిర్వహిస్తూ రెండు ఫొటోలు దిగి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడానికి మాత్రమే పరిమితమవుతోంది. కలిసికట్టుగా పండగ చేసుకోవడంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించలేకపోతోంది. మురపాక వాసులు మళ్లీ ఆ నాటి సంప్రదాయానికి జీవం పోస్తున్నారు. లక్ష పిడకలు తయారు చేసి బోగి చేయడానికి పూనుకుంటున్నారు. సలక్షణమైన ఈ ఆలోచనకు స్థానికులూ సై అంటున్నారు. 

సాక్షి, లావేరు(శ్రీకాకుళం): సంకురాతిరి వచ్చేస్తోంది. కానీ సందడి మాత్రం కొద్దిగానే కనిపిస్తోంది. పాశ్చాత్య మోజులో పడి మన సంసృతి, సంప్రదాయాలు, పండగలు, ఆచారాలను చాలా మంది మరిచిపోతున్నారు. నానాటికీ అంతరించిపోతున్న ఆచారాలను బతికించాలనే తలంపుతో మురపాక గ్రామంలో వినూత్నంగా లక్ష ఒక్క బోగి పిడకల పండగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మురపాక గ్రామంలోని సీతారామాలయ, ఉమానరేంద్రస్వామి ఆలయ కమిటీలు, వివేకానంద యూత్‌ సొసైటీ, అంబేడ్కర్‌ యూత్‌ సొసై టీ, శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్థానికుల నుంచి కూ డా మంచి స్పందన కనిపిస్తోంది.

గ్రామంలో ఎవరైతే ఎక్కువ బోడి పిడకలను తయారు చేస్తారో వారికి బోగి పండగ రోజు ప్రత్యేక బహుమతులు ఇస్తామని గ్రామంలో ప్రకటనలు జారీ చేయడం, ర్యాలీలు చేసి ప్రజలకు అవగాహన కల్పించడం కూడా చేశారు. దీంతో  గ్రామంలోని మహిళలు, పిల్లలు, వృద్ధులు, పెద్దలు, రైతులు, యువకులు చాలా మంది గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొని బహుమతుల కోసం బోగి పిడకలు తయారు చేస్తున్నారు. చిన్నారులు అయితే ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రతి రోజూ గ్రామంలో ఆవుపేడను సేకరించి వాటితో పిడకలు తయారు చేయడం చేస్తున్నారు. భోగి పండగ రోజు ఆవుపేడతో తయారుచేసిన పిడకలను కాల్చడం వలన పాజిటివ్‌ వైబ్రేషన్లు వస్తాయని అంటున్నారు.

మంచి స్పందన వస్తోంది
కనుమరుగైపోతున్న మన విశిష్టతల గురించి నేటి తరానికి తెలియజేయడం కోసం మురపాకలో లక్ష ఒక్క బోగి పిడకల పండగ కార్యక్రమం చేపట్టాం. కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. గ్రామంలో పిల్లలు, పెద్దలు, మహిళలు, యువత అందరూ బోడి పిడకలు తయారు చేస్తున్నారు. 
– ప్రగడ శ్రీనివాసరావు, సీతారామాలయం కమిటీ సభ్యుడు, మురపాక గ్రామం 

మంచి పని చేస్తున్నారు 
సమైక్యత, సదాచారం, సంతోషంతో పాటు మంచి పవిత్ర భావాలను పరిరక్షించి సంస్కృతిని కాపాడడమే మన పండగల పరమార్థం. కానీ నేటి తరానికి ఆ విలువలు తెలీడం లేదు. ఇలాంటి తరుణంలో ఈ కార్యక్రమం చేయడం మంచి పరిణామం. 
– తేనేల మంగయ్యనాయుడు, రిటైర్డు హెచ్‌ఎం, మురపాక గ్రామం 

సంప్రదాయాలను బతికంచడం కోసమే.. 
పాశ్చాత్య మోజులో పడి మన సంస్కృతీ, సంప్రదాయాలను మర్చిపోతున్నాం. వాటికి మళ్లీ జీవం పోయాలనే తలంపుతోనే ఈ కార్యక్రమం తలపెట్టాం. ఎక్కువ పిడకలు తయారు చేసిన వారికి బహుమతులు కూడా ఇస్తాం.  
– బాలి శ్రీనివాసనాయుడు, వివేకానంద యూత్‌ సొసైటీ అధ్యక్షుడు, మురపాక గ్రామం

మరిన్ని వార్తలు