జమ్మూలో వైభవంగా శ్రీవారి ఆలయానికి భూమి పూజ

14 Jun, 2021 04:49 IST|Sakshi
భూమి పూజలో పాల్గొన్న జమ్మూ–కశ్మీర్‌ ఎల్జీ మనోజ్‌ సిన్హా , కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి తదితరులు

హాజరైన ఎల్జీ మనోజ్‌ సిన్హా, కేంద్ర సహాయ మంత్రులు కిషన్‌రెడ్డి, జితేంద్ర సింగ్‌ 

62.10 ఎకరాల్లో ఆలయం, వేద పాఠశాల, భక్తులకు వసతి 

18 నెలల్లో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తాం: టీటీడీ చైర్మన్‌ 

తిరుమల/సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ సమీపంలోని మజీన్‌ గ్రామంలో శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి ఆదివారం వైభవంగా భూమి పూజ నిర్వహించారు. తొలుత యాగశాలలో అర్చకులు, వేద పండితులు గణపతి పూజ, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ట, వాస్తుహోమం జరిపారు. భూమి పూజ స్థలంలో నవరత్నాలను, వాటి మీద శిలను ఉంచి చతుర్వేదాలను, అష్టదిక్పాలకులను ఆవాహనం చేశారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డిలు యాగశాల నుంచి తెచ్చిన కలశ జలాలతో శిలను అభిషేకించారు. అనంతరం మహావిష్ణువును ఆరాధించి శిలను భూమిలో ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. జమ్మూ–కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) మనోజ్‌ సిన్హా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్, ఎంపీ జగల్‌ కిషోర్‌ శర్మ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత రామ్‌మాధవ్, టీటీడీ పాలక మండలి సభ్యుడు గోవింద హరి, పలువురు స్థానిక నేతలు, అధికారులు భూమి పూజలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ నిర్మాణానికి సంబంధించిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. 

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా హిందూ ధర్మ ప్రచారం: టీటీడీ చైర్మన్‌ 
రూ.33.22 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఆలయాన్ని 18 నెలల్లో పూర్తి చేస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. భూమి పూజ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం మేరకు దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారానికి టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయాలు నిర్మించాలని సంకల్పించినట్లు ఆయన వివరించారు. కన్యాకుమారిలో ఇప్పటికే స్వామివారి ఆలయం నిర్మించామన్నారు. జమ్మూలో ఆలయ నిర్మాణానికి ఏడాది నుంచి ప్రయత్నాలు చేసినట్లు చెప్పారు. టీటీడీ విజ్ఞప్తి మేరకు జమ్మూ–కశ్మీర్ ప్రభుత్వం టీటీడీకి 62.10 ఎకరాల భూమి కేటాయించిందన్నారు. కోవిడ్‌ కారణంగా ఆలయ నిర్మాణానికి భూమి పూజ ఆలస్యం అయ్యిందని తెలిపారు. రూ.33.22 కోట్లతో పనులు చేపట్టడానికి అనుమతులు మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు వసతి, వేద పాఠశాల, ధ్యాన కేంద్రం, సిబ్బందికి నివాసాలు తదితరాలు నిర్మించనున్నట్లు తెలిపారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు