21 కరోనా మృతదేహాలకు అంతిమసంస్కారాలు

6 May, 2021 04:21 IST|Sakshi
కరోనా మృతదేహాలను మోసుకుని అంబులెన్స్‌లో పెడుతున్న ఎమ్మెల్యే భూమన

ఎమ్మెల్యే భూమన మానవత్వం 

తిరుపతి తుడా (చిత్తూరు జిల్లా): తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మానవత్వం చాటుకున్నారు. కరోనాతో మృతి చెందిన 21 మృతదేహాలను బంధువులు ఆస్పత్రిలో విడిచిపెట్టి వెళ్లగా, రుయా మార్చురీలో ఉన్న అనాథ మృతదేహాలకు బుధవారం ఎమ్మెల్యే ముందుకొచ్చి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. గత ఏడాది ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు తిరుపతిలో తొలిసారి కరోనా మృతదేహాలకు ఎమ్మెల్యే భూమన దగ్గరుండి చివరితంతును నిర్వహించారు. మరోసారి ఇప్పుడు 21 మృతదేహాలకు సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహాలను మహాప్రస్థానం వాహనంలోకి నేరుగా ఆయనే ఎక్కించారు. కరోనాబారిన పడిన మృతదేహాలకు ఏడాది నుంచి కోవిడ్‌–19 తిరుపతి ముస్లిం జేఏసీ నాయకులు తమ సొంత ఖర్చులతో అంతిమసంస్కారాలను నిర్వహిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భూమన చివరితంతు నిర్వహించారు. 

భూమనకు పీఎంవో అభినందనలు
ఎమ్మెల్యేకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అభినందనలు వచ్చాయి. ప్రధాని మోదీ ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా బుధవారం నిర్వహించిన వర్చువల్‌ మీటింగ్‌లో అభినందనలు తెలిపారు. తిరుపతిలో కరోనా బారినపడి మృతిచెందిన పార్ధివదేహాలకు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించడం అందరికీ ఆదర్శమని ఆయనను కొనియాడారు.  

చదవండి: కరోనా: ఒక్కడే.. ఆ నలుగురై! 

మరిన్ని వార్తలు