ప్రాణాలకు తెగించి వైద్యబృందం సేవలు

30 Jul, 2020 07:41 IST|Sakshi
సమీక్షలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, జిల్లా కలెక్టర్‌ భరత్‌గుప్తా, మున్సిపల్‌ కమిషనర్‌ గిరీష, ఇతర అధికారులు

కోవిడ్‌ సమీక్షలో ఎమ్మెల్యే 

భూమన కరుణాకరరెడ్డి ప్రశంస

తిరుపతి తుడా: కనిపించని శత్రువుతో ప్రాణాలకు తెగించి వైద్య బృందం అనితరమైన సేవలు అందిస్తోందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ప్రశంసించారు. రానున్న క్లిష్ట సమయంలో మరింత సేవలు అందించాల్సి ఉందన్నారు. బుధవారం రుయా ఆసుపత్రిలో కోవిడ్‌–19పై అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేతో కలిసి జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా, నగరపాలక కమిషనర్‌ గిరీషా, జేసీ–2 వీరబ్రహ్మం, అసిస్టెంట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్, రుయా హెచ్‌ఓడీలు, డాక్టర్లతో సమీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, కరోనా విపత్తులో డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, అధికారులు అందిస్తున్న సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. జిల్లా కలెక్టర్‌ కోరితే అవసరమైన పక్షంలో శ్రీవారి సేవకుల సేవలు కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.  

 రాబోవు రోజుల్లో కేసుల తీవ్రత అధికం : కలెక్టర్‌
కలెక్టర్‌ మాట్లాడుతూ, రాబోవు 15 రోజుల్లో కేసుల నమోదు తీవ్రత అధికంగా ఉండబోతోందని, దీనిని దృష్టిలో ఉంచుకుని సేవలు విస్తృతం చేస్తామన్నారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ఎస్వీ మెడికల్‌ కళాశాల హెచ్‌ఓడీలు పర్యవేక్షించాలన్నారు. పేషెంట్‌ పరిస్థితిని వారి బంధువులకు వివరించడానికి సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. కరోనా మృతులకు అంత్యక్రియలకు గోవిందధామంలో మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ శ్మశానవాటికలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో పాజిటివ్‌ అని తేలిన అర్ధగంట లోపు బాధితులు కోవిడ్‌ చికిత్సకు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలను గుర్తుచేశారు. డాక్టర్లు అందరూ వైద్య సేవల్లోకి రావాలని, నాన్‌ మెడికల్‌ విధుల్లో అవసరమైన డాటా ఎంట్రీ సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్నారు. సాధారణ రోగులకు వార్డులు కష్టతరంగా ఉందని, ఆక్సిజన్‌ ప్లాంట్‌–12 కేఎల్‌ ఏర్పాటు చేయాలని వైద్యాధికారులు కోరారు.

త్వరలో 200మంది నర్సింగ్‌ స్టాఫ్‌ నియామకం
అనంతరం రుయా హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ చాంబర్‌లో రుయా వైద్య అధికారులతో ఎమ్మెల్యే, కలెక్టర్, కమిషనర్‌ సమావేశమయ్యారు. ఆసుపత్రిలో శానిటేషన్‌ మరింత మెరుగు పరిచేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. శానిటేషన్‌ సరిలేని చోట ఫోన్‌నంబర్‌ ఏర్పాటు చేసి ఆ నంబరుకు మెసేజ్‌ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రుయాకు సంబంధించి ఏ అవసరాలు ఉన్నా జేసీ వీరబ్రహ్మం ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. త్వరలో 200 మంది నర్సింగ్‌ స్టాఫ్‌ను జిల్లాలో నియమించనున్నట్టు కలెక్టర్‌ చెప్పారు. రుయా డెవలప్‌మెంట్‌ కమిటీ వర్కింగ్‌ చైర్మన్‌ బండ్ల చంద్రశేఖర్, ఏపీఎంఐడీసీ ఈఈ  ధనుంజయరావు, డ్వామా పీడీ చంద్రశేఖర్, డీఎంహెచ్‌ఓ పెంచలయ్య, డీసీహెచ్‌ఎస్‌ సరళమ్మ, ఎస్వీ మెడికల్‌ ప్రిన్సిపల్‌ జయభాస్కర్, డాక్టర్లు సంధ్య, జమున, సరస్వతి, నాగమునీంద్రుడు, సుబ్బారావు, ఫయీమ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు