ప్రజలు మావైపే...మళ్లీ ప్రభంజనమే 

8 May, 2022 10:14 IST|Sakshi

జిల్లాపై జెండా ఎగురవేస్తాం

ఈ నెల 11 నుంచి ‘గడప గడపకూ’ 

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ

కదిరి:‘మూడేళ్లలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో మేము చేసిన అభివృద్ధిని జనం కళ్లారా చూశారు. అందుకే మా వెంటే నడుస్తున్నారు. రానున్న ఎన్నికల్లోనూ ప్రభంజనం ఖాయం.  జిల్లాలోని అన్ని స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ జెండా ఎగురవేస్తాం’’ అని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర నారాయణ ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లాలో కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ఈ నెల 11 నుంచి ‘గడప గడపకూ’ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

ప్రతి ఎమ్మెల్యే గడప గడపకూ వెళ్లి జగనన్న ప్రవేశ పెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తారని తెలిపారు. అలాగే ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఏ మేరకు లబ్ధి చేకూరిందో తెలియజేస్తామన్నారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలకు ఎవరైనా దూరమైతే... అక్కడికక్కడే సమస్య పరిష్కరిస్తారన్నారు. కదిరి ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి మాట్లాడుతూ... కదిరి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, 30 ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ మూడేళ్లలో చేసి చూపించామన్నారు. సమావేశంలో ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్లు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు