చిత్తూరు జిల్లాలో బయోగ్యాస్‌ ప్లాంట్లు

5 Aug, 2021 04:31 IST|Sakshi

గోబర్‌–ధన్‌ పథకం పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు

తర్వాత కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఏర్పాటు

కేంద్ర మంత్రి షెకావత్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పెద్దిరెడ్డి 

సాక్షి, అమరావతి: పశువుల పేడ, ఇతర వ్యవసాయ వ్యర్థాల ద్వారా పెద్ద తరహా (కస్టర్‌ బేస్‌డ్‌) బయోగ్యాస్‌ తయారీ యూనిట్లను పైలెట్‌ ప్రాజెక్టుగా చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో పశు, వ్యవసాయ వ్యర్థాల నుంచి బయోగ్యాస్‌ తయారీతోపాటు సేంద్రియ ఎరువుల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గోబర్‌–ధన్‌ పథకంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ బుధవారం వివిధ రాష్ట్రాలకు చెందిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మన రాష్ట్రం నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ సంపత్‌కుమార్‌ , మరో 12 రాష్ట్రాల మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ గోబర్‌–ధన్‌ పథకంలో రాష్ట్రంలో ఈ తరహా ప్లాంట్ల ఏర్పాటుకు కృష్ణా, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో అవకాశం ఉందని గుర్తించినట్టు తెలిపారు. ఆయా జిల్లాల్లో కనీసం 50 కంటే ఎక్కువగా పశువులున్న 54 గోశాలలు, 55 భారీ డెయిరీ ఫాంలను గోబర్‌ గ్యాస్‌ ఉత్పత్తి కోసం గుర్తించినట్టు చెప్పారు. వాటిలో మొదట పైలెట్‌ ప్రాజెక్టుగా చిత్తూరు జిల్లాలో అమలు చేసి, తర్వాత మిగిలిన మూడు జిల్లాల్లో అమలు చేయనున్నట్టు తెలిపారు. 

రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు
ఈ పథకం అమలులో భాగంగా రాష్ట్రస్థాయిలో అపెక్స్, అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలో వ్యవసాయ, పశుసంవర్ధక, పాల ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. గ్రామాల్లో గోబర్‌–ధన్‌ పథకం కింద పశువ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలను కూడా సరైన పద్ధతుల్లో వినియోగించుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యాచరణను రూపొందించినట్లు వెల్లడించారు. 

ఈ పథకం అమలు కోసం డీపీఆర్‌లను సిద్ధం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించామని, వారి ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఈ పథకం కింద ఏర్పాటుచేసే ప్లాంట్‌ల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్, కంపోస్ట్‌లను మార్కెట్‌ చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ప్రతి జిల్లాకు రూ.50 లక్షలు..
గోబర్‌–ధన్‌ పథకం కోసం ప్రతి జిల్లాకు రూ.50 లక్షలు కేటాయిస్తున్నామని, ఇంకా అవసరమైతే  15వ ఆర్థికసంఘం నిధులను కూడా వినియోగిస్తామని తెలిపారు. వ్యక్తిగత గృహాల మోడల్, క్లస్టర్‌ మోడల్, కమ్యూనిటీ మోడల్, కమర్షియల్‌ మోడళ్లలో ఈ పథకాన్ని విస్తరిస్తామని చెప్పారు. ఇవికాకుండా రాష్ట్రమంతటా ఘన వ్యర్థాలను శుద్ధిచేసేందుకు, సేంద్రియ ఎరువులుగా మార్చేందుకు ఉపాధిహామీ పథకం కింద 10,645 సాలిడ్‌ వేస్ట్‌ ప్రాసెసింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 1,042 కేంద్రాల్లో ఈ ప్రక్రియ మొదలైందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.  

మరిన్ని వార్తలు