Kodi Rammurthy Naidu: తెరపైకి కలియుగ భీముడు

3 Nov, 2021 07:21 IST|Sakshi
వీరఘట్టం తెలగవీధి వద్ద గతేడాది ఏర్పాటు చేసిన కోడి రామ్మూర్తినాయుడి విగ్రహం (ఇన్‌సెట్లో) కోడి రామ్మూర్తి నాయుడు చిత్రపటం

వెండితెరపై యోధుడి కథ

కోడి రామ్మూర్తినాయుడు జీవిత చరిత్ర

స్వగ్రామం వీరఘట్టంలో ఇదే అంశంపై చర్చలు

నేడు ఆయన 139వ జయంతి

వీరఘట్టం: మల్ల మార్తాండ, కళియుగ భీముడు, ఇండియన్‌ హెర్క్యులస్‌గా ప్రపంచ దేశాల్లో భారత దేశ కీర్తిని చాటి చెప్పిన సిక్కోలు ముద్దు బిడ్డ కోడి రామ్మూర్తి నాయుడు జీవిత చరిత్ర వెండితెరపై రావడానికి సిద్ధమవుతోంది. సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, హీరోలు, రచయితలు కోడి రామ్మూర్తినాయుడు కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నారు. ఆయన స్వగ్రామం వీరఘట్టంలో ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ‘సాక్షి’తో మాట్లాడుతూ పలు విషయాలు వివరించారు.

వీరఘట్టంకు చెందిన కోడి వెంకన్ననాయుడు, అప్పలకొండ దంపతులకు 1883 నవంబర్‌ 3న రామ్మూర్తినాయుడు జన్మించారు. చిన్నతనంలో తల్లిని కోల్పోయిన రామ్మూర్తిని తండ్రి ఎంతో గారాబంగా చూసేవారు. రామ్మూర్తినాయుడు బాల్యంలో బడికి వెళ్లకుండా వీరఘట్టంకు సమీపంలో ఉన్న రాజ చెరువు వద్దకు రోజూ వెళ్లి వ్యాయామం చేస్తుండేవారు. దీంతో బాల్యంలోనే కొడుకుని చదువు కోసం తండ్రి వెంకన్న వీరఘట్టం నుంచి విజయనగరంలోని పినతండ్రి నారాయణస్వామి ఇంటికి పంపించేశారు. విజయనగరంలో కూడా చదువు కంటే వ్యాయామంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతూ మల్లయుద్ధం పోటీల్లో పాల్గొనేవారు. ఇక రామ్మూర్తికి చదువు అబ్బదని గ్రహించిన పిన తండ్రి రామ్మూర్తిని మద్రాసు పంపించి వ్యాయామ కళాశాలలో చేర్పించారు. తర్వాత వ్యాయామ ఉపాధ్యాయునిగా నాయుడు విజయనగరంలో తాను చదివిన కళాశాల్లోనే పీడీగా చేరారు.

కోడి రామ్మూర్తి విగ్రహం వద్ద ఆయన వారసులు 

బహుముఖ ప్రజ్ఞాశాలి.. 
రామ్మూర్తి నాయుడు వ్యాయామ విద్యను బోధిస్తూనే వాయు స్తంభన, జలస్తంభన విద్యలను ప్రదర్శించేవారు. ఇలా వ్యాయామ, దేహదారుఢ్యం, యోగా విద్యలను అలవోకగా చేసేవారు. తర్వాతి కాలంలో ఆయన విజయనగరంలో ఓ సర్కస్‌ కంపెనీ మొదలుపెట్టారు. ఇది ఆయన పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది. రామ్మూర్తి తన 20 ఏళ్ల వయసులోనే గుండెల మీద ఒకటిన్నర టన్ను బరువును మోసి చూపించేవారు. సర్కస్‌లో విన్యాసాలు మరింత కఠినమైనవి. ఆయనను ఉక్కు గొలుసులతో బంధించేవారు. ఊపిరితిత్తుల నిండా గాలి పూరించి, ఆ గొలుసులను తెంచేవారు.

వీరఘట్టంలో రామ్మూర్తినాయుడు జన్మించిన గృహం ఇదే  

రెండు కార్లకు గొలుసులు కట్టి, వాటిని తన భుజాలకు తగిలించుకునేవారు. కార్లను వేగంగా నడిపించేవారు. అయినప్పటికీ అవి కదిలేవి కావు. ఏనుగును ఛాతీ మీద ఎక్కించి దాదాపు ఐదు నిమిషాలు నిలిపేవారు. అందుకే ఆయన సర్కస్‌కు విశేషమైన ఆదరణ ఉండేది. ఆసియాలోని జపాన్, చైనా, బర్మా దేశాల్లో కూడా రామ్మూర్తినాయుడు ప్రదర్శనలు ఇచ్చి భారతదేశ కీర్తిని చాటిచెప్పారు. బర్మాలో ఆయనపై హత్యాయత్నం జరగడంతో విదేశీ ప్రదర్శనలను నిలిపివేసి స్వదేశంలోనే స్థిరపడ్డారు.

బ్రహ్మచారి.. 
కండల వీరుడు కోడి రామ్మూర్తినాయుడు బ్రహ్మచారి. శాకాహారి అయిన ఆయన ఆంజనేయ భక్తుడు. చిన్నతనంలో వీరఘట్టం సమీపంలోని రాజ చెరువు వద్ద వ్యాయామం చేస్తున్న సమయంలో ఓ సాధువు ఆయనను చూసి పిలిచి మంత్రోపదేశం చేశారట. అప్పటి నుంచి రామ్మూర్తికి దైవచింతన కలిగిందని స్థానికులు చెబుతారు.   

కుదిరిన అగ్రిమెంట్‌..
ఇలాంటి మహాబలుని జీవిత గాథ తెరపై ఎక్కించేందుకు ఇటీవల సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు వీరఘట్టం వచ్చి ఇక్కడ రామ్మూర్తినాయుడు సంచరించిన ప్రదేశాలను, నివాస గృహాన్ని పరిశీలించా రు. అలాగే విజయనగరంలో రామ్మూర్తినాయుడు చదువుకున్న కళాశాలను, పనిచేసి నివాసం ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి రామ్మూర్తినాయుడి జీవిత చరిత్ర తీసేందుకు అగ్రిమెంట్‌ కూడా కుదుర్చుకున్నారు.

మా చిన్న తాత..  
కోడి రామ్మూర్తి నాయుడు మా చిన్నతాతయ్య. నేను 1947లో పుట్టాను. అప్పటికే ఆయన చనిపో యారు. అప్పటిలో ఆయన గొప్పతనం మాకు తెలియలేదు. నేను పెద్దయ్యా క ఆయన గొప్పతనం గురించి తెలుసుకున్నాను. టీచర్‌గా రిటైరై ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. ఇటీవల సినిమా వాళ్లు సంప్రదింపులు చేశారు. మా తాతయ్య జీవిత చరిత్ర సినిమా గా తీస్తామంటే పూర్తిగా ఆయన చరిత్ర వివరించాం.
– కోడి కైలాసరావు, రామ్మూర్తినాయుడి మనవడు, రిటైర్డ్‌ టీచర్, హైదరాబాద్‌  

అమెరికాలోనూ.. 
కోడి రామ్మూర్తి నాయుడంటే అమెరికాలో కూడా మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ ప్రవాసాంధ్రులందరికీ ఆయన గురించి తెలుసు. అలాంటి గొప్ప వ్యక్తి జీవిత చరిత్ర వెండితెరపై చూపించేందుకు సినీ ప్రముఖులు మా కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపారు. మరి కొద్ది రోజుల్లో ఆయన జీవిత చరిత్ర సినిమా ద్వారా ప్రపంచ నలుమూలలా తెలియనుండడం ఎంతో ఆనందంగా ఉంది.
– కోడి రాజశేఖర్, రామ్మూర్తినాయుడి ముని మనవడు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, అమెరికా 

సాహసాలు విన్నాం.. 
రామ్మూర్తినాయుడు మా చిన్న తాతయ్య. మా చిన్నతనంలో ఆయన విన్యాసాలు, సాహసాల గురించి విన్నాం. నేను ఆయనను చూడలేదు. మా నాన్న చెప్పేవారు. ఇటీవల ఓ సినీ సంస్థ వారు వచ్చారు. జీవిత చరిత్ర తీస్తామంటే మా కుటుంబం అంతా అంగీకరించాం. ఎప్పుడు సినిమా మొదలవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నాం. 
– కోడి వెంకటరావునాయుడు, రామ్మూర్తినాయుడి మనవడు, వీరఘట్టం 

మరిన్ని వార్తలు