70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద బర్డ్‌ ప్లూ వైరస్‌ బతకదు

24 Jan, 2021 04:54 IST|Sakshi

మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు 

సాక్షి, అమరావతి: బర్డ్‌ ఫ్లూ వ్యాధిని కలుగజేసే వైరస్‌ 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 30 నిముషాలకు మించి బతకదని పరిశోధనల్లో నిర్ధారౖణెనట్లు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. పూర్తిగా ఉడికించిన కోడిగుడ్లు, మాంసం తినడం వల్ల బర్డ్‌ ఫ్లూ రాదని, ప్రజలు లేనిపోని వదంతులు నమ్మకుండా వాటిని ఆహారంగా తీసుకుని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ వ్యాధి బాగా విస్తరిస్తున్నందున రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

ఎక్కడైనా అనూహ్య రీతిలో కోళ్లు మరణిస్తే వెంటనే స్థానిక పశు వైద్యాధికారులకుగానీ, సమీప ఆర్‌బీకేలు, సచివాలయాలకుగానీ సమాచారం ఇవ్వాలని చెప్పారు. మన రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ వ్యాధి ఎక్కడా నిర్ధారణ కాలేదన్నారు. ఎలాంటి విపత్తు సంభవించినా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని శనివారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు.   

>
మరిన్ని వార్తలు