ఎయిర్‌పోర్టులో విమానాలకు పక్షుల బెడద

13 Sep, 2022 10:10 IST|Sakshi

కృష్ణా (గన్నవరం): అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు పొందిన గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు పక్షుల బెడద తప్పడం లేదు. విమానాశ్రయ పరిసరాల్లో డంప్‌ చేస్తున్న జంతు కళేబరాలు, మాంసం వ్యర్థాలు, చెత్తాచెదారం కారణంగా పక్షుల సంచారం విపరీతంగా పెరిగింది. ఫలితంగా తరచూ విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌ సమయాల్లో పక్షుల వల్ల తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. గతంలో ఇక్కడ పలుమార్లు విమానాలను పక్షులు ఢీకొన్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ సమయాల్లో విమానాలకు తృటిలో ప్రమాదాలు తప్పినా అధికారులు మాత్రం అప్రమత్తం కావడం లేదు.

ఈ తరహా సంఘటనలు జరిగినప్పుడు విమానాశ్రయ పరిసరాల్లో ఆక్రమ చెత్త డంపింగ్‌ నివారణపై సమావేశాలు నిర్వహించి హడావుడి చేస్తున్న అధికారులు ఆచరణలో మాత్రం విస్మరిస్తున్నారు. విమానాశ్రయం చుట్టూ ఉన్న గ్రామాలు ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాలను డంపింగ్‌ యార్డులుగా ఉపయోగిస్తున్నాయి. విమానాశ్రయ రన్‌వేకు అతిసమీపంలో ఉన్న కొత్తపేట వద్ద పాటిగోతుల్లో మాంసం దుకాణదారులు వ్యర్థాలను మూటలు కట్టి తీసుకువచ్చి పడవేస్తున్నారు. దీనికితోడు జంతు కళేబరాలు, చెత్తా చెదారం యథేచ్ఛగా ఇక్కడ డంప్‌ చేస్తున్నారు. దీంతో వీటి కోసం వచ్చే గద్దలు పక్కనే ఉన్న రన్‌వేపైకి చేరుతున్నాయి.

 రాజీవ్‌నగర్‌తో పాటు ఎయిర్‌పోర్టు తూర్పు వైపు ఉన్న వాగు కూడా పక్షుల సంచారానికి కారణమైంది. ఇంకా రాజీవ్‌నగర్‌ కాలనీ, బుద్ధవరం వైపు విమానాశ్రయ పరిసరాల్లో పారిశుద్ధ్యం మరీ అధ్వానంగా ఉంది. దీనికితోడు విజయవాడ హోటళ్లలోని వ్యర్థాలను రాత్రి వేళల్లో ఆటోల్లో తీసుకువచ్చి కేసరపల్లి, ఎయిర్‌పోర్టు పరిసరాల్లో డంప్‌ చేస్తున్నారు. వీటివల్ల పక్షుల సంచారం పెరిగి విమానాల రాకపోకల సమయంలో ఆటంకం ఏర్పడుతోంది. దీనితో పక్షులను బెదరకొట్టేందుకు ఎయిర్‌పోర్టు సిబ్బంది బాణసంచా ఉపయోగించాల్సిన పరిస్థితి నెలకొంది.  

గుణపాఠం నేర్వని అధికారులు
గత పదేళ్ల వ్యవధిలో ఇక్కడ విమానాలను ఏడుసార్లకు పైగా పక్షులు ఢీకొన్నాయి. తరచూ విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ సమయాల్లో పక్షుల వల్ల విమాన పైలెట్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పక్షులు ఢీకొనడం వల్ల ఇప్పటివరకు ఎయిరిండియా, స్పైస్‌జెట్, ఎయిర్‌కొస్తా, జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానాలు సర్వీస్‌లు రద్దు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. పక్షులు ఢీకొన్నప్పుడు విమాన రెక్కలు, ఇంజన్‌ భాగాలు దెబ్బతిని సదరు విమాన సంస్థలకు రూ.కోట్లలో నష్టం కూడా వాటిల్లింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రం ఎయిర్‌పోర్టు అధికారులు సమావేశాలు నిర్వహించి పక్షుల నివారణ, అక్రమ డంపింగ్‌ అరికట్టేందుకు ఆదేశాలు ఇస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పంచాయతీ, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో అనధికార డంపింగ్‌ యథావిధిగా కొనసాగుతోంది. దీనితో విమానాలకు పక్షుల బెడద తప్పడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎయిర్‌పోర్టు పరిసరాల్లో మాంసం వ్యర్థాలు, జంతు కళేబరాలు, చెత్తాచెదారం డంప్‌ చేయకుండా చర్యలు తీసుకోవాలని విమాన ప్రయాణికులు కోరుతున్నారు. 

కొరవడిన ఎయిర్‌పోర్టు సహకారం 
విమానాశ్రయ పరిసర గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ఎయిర్‌పోర్టు నుంచి సహకారం కొరవడింది. సామాజిక బాధ్యత పథకం కింద ఎయిర్‌పోర్టు అథారిటీ గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చేందుకు అవసరమైన సామగ్రిని అందించే వెసులుబాటు ఉంది. దీనికోసం ఏటా జరిగే పర్యావరణ సమావేశంలో ఎయిర్‌పోర్టు చుట్టూ ఉన్న బుద్ధవరం, కేసరపల్లి, అల్లాపురం, గన్నవరం గ్రామ పంచాయతీల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. ఆయా గ్రామాల్లో చెత్త నిర్వహణకు రిక్షాలు, డస్ట్‌బిన్‌లు, ఎస్సీ, బీసీ ఏరియాల్లో డ్రైనేజీ నిర్మాణాలకు ఎయిర్‌పోర్టు అధికారులకు ప్రతిపాదనలు ఇస్తున్నప్పటికీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహకారం అందించలేదని పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పారిశుద్ధ్య  నిర్వహణకు ఎయిర్‌పోర్టు అథారిటీ గ్రామ పంచాయతీలకు తమ వంతు సహకారం  అందించాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు