పిట్ట బతుకే ఎంత హాయి...

5 Jun, 2021 14:06 IST|Sakshi

‘పిట్ట బతుకూ ఎంత హాయి’ అంటూ ప్రముఖ రచయిత, గాయకుడు గోరటి వెంకన్న పాటందుకుంటే ఏదో అనుకున్నాం. కానీ ఈ పక్షుల సమూహాన్ని చూస్తుంటే ‘నిజమే ఎంత హాయి’ అనిపిస్తుంది ఎవరికైనా. మాస్క్‌లు లేవు... భౌతిక దూరం బాధే లేదు... మందు, మాకూ చింతే లేదు... వ్యాక్సినేషన్‌ గొడవ అంతకన్నా లేదు. ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అనే మాటను మరచిపోయి ఏడాదిన్నరకుపైనే దాటిపోయింది.

సరదాగా మీలా కూర్చొని నాలుగు కబుర్లు... మనసారా నవ్వులు ఊసే లేదు. వరుస మరణాలు సంభవిస్తే ‘పిట్టల్లా రాలిపోతున్నారు’ అనే వాళ్లం. కానీ ఇప్పుడు మా ‘నవ’ జాతే కూలిపోతోంది... మీ కిలకిలా రావాలు ఎప్పటిలానే వసంత రుతువును తలపిస్తోంది.

మీలో ఉరకలెత్తే ఆ ఉత్సాహం... సంతోషం మా సొంతమయ్యేదెప్పుడో... ‘ఉందిలే మంచి కాలం ముందూముందునా... అందరూ సుఖపడాలి నందానందనా’ అని ఆలపించుకుంటూ... ఆ కాలం కోసం ఎదురు చూస్తున్నామని గుమిగూడిన విహంగాల గుంపును చూసినవారు అభిలషించారు. జిల్లా కేంద్రమైన విజయనగరంలోని గురజాడ అప్పారావు రోడ్డు మార్గంలో ఓ ఫ్లెక్సీ ఐరన్‌ రాడ్లపై ఈ దృశ్యం ‘సాక్షి’ కెమెరా కంటపడగానే ‘క్లిక్‌’మంది. 
– సత్యనారాయణ, సాక్షి ఫొటోగ్రాఫర్‌, విజయనగరం 

Photo Feature: రెడీ టు టేకాఫ్‌.. తిరుగు ప్రయాణానికి సిద్ధం

>
మరిన్ని వార్తలు