స్వేచ్ఛ, సమానత్వమే అంబేడ్కర్‌ జీవిత సూత్రాలు

15 Apr, 2022 05:10 IST|Sakshi
అంబేడ్కర్‌ చిత్రపటం వద్ద గవర్నర్‌ నివాళి

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ నివాళి  

సాక్షి, అమరావతి: స్వేచ్ఛ, సమానత్వాన్ని జీవిత సూత్రాలుగా గుర్తించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సామాజిక ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించారని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. కుల, మత రహిత భారతదేశం కోసం జీవితకాలం పాటు పోరాటం చేశారన్నారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా గురువారం విజయవాడలోని రాజ్‌భవన్‌లో రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి గవర్నర్‌ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంటరానితనానికి వ్యతిరేకంగా అంబేడ్కర్‌ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. సంఘ సంస్కర్త, రాజకీయవేత్తగా ఆయన దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు.

వర్ధమానుడి బోధనలు సదా ఆచరణీయం
వర్ధమాన మహావీరుడు ప్రబోధించిన అహింసా మార్గం సదా ఆచరణీయమని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. గురువారం రాజ్‌భవన్‌లో జరిగిన వర్ధమాన మహావీరుడి జయంతి కార్యక్రమంలో గవర్నర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ జైన్‌ సమాజ్‌ ప్రతినిధులు గవర్నర్‌ను సత్కరించారు. కార్యక్రమంలో గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, జైన్‌ సమాజ్‌ ప్రతినిధులు మనోజ్‌ కొఠారి, పబ్నాలాల్, సుక్రజ్, దినేష్, కిశోర్, నరేంద్ర, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు