రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి సహకారం 

25 Jul, 2021 05:09 IST|Sakshi
ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ గా రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శనివారం రాజ్‌భవన్‌లో మాట్లాడుతున్న గవర్నర్‌ విశ్వభూషణ్‌

ఇక్కడి ప్రజల ప్రేమ, ఆప్యాయత మరిచిపోలేను 

రెండేళ్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది 

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌  

సాక్షి, అమరావతి:  రెండేళ్లలో అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఇటు రాజ్‌భవన్‌ అధికార సిబ్బంది నుంచి తనకు మంచి సహకారం లభించిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రథమ పౌరునిగా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు అయిన సందర్భంగా రాజ్‌ భవన్‌ ప్రాంగణంలో గవర్నర్‌ హరిచందన్, సుప్రవ హరిచందన్‌ దంపతులు శనివారం మొక్కలు నాటారు. కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో అతి నిరాడంబరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. మరే ఇతర కార్యక్రమాలకు గవర్నర్‌ అంగీకరించలేదు. రాజ్‌భవన్‌ అధికారులు, సిబ్బంది మాత్రమే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్‌గా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ప్రేమ, ఆప్యాయతలను ఎప్పటికీ మరచిపోలేనని చెప్పారు. చెట్ల పెంపకం, రక్తదానం వంటి కార్యక్రమాలలో పూర్వం ఉన్న అన్ని రికార్డులను అధిగమించి, రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర శాఖ కొత్త రికార్డులను నెలకొల్పిందని కితాబిచ్చారు. కోవిడ్‌–19 ఇబ్బందుల్లో ప్రజల కోసం రెడ్‌క్రాస్‌ ఎంతో కృషి చేసిందని చెప్పారు. రక్తం అందుబాటులో లేకపోవటం వల్ల రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదనే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని అభినందించారు. అనంతరం గవర్నర్‌ సంయుక్త కార్యదర్శి ఎ.శ్యామ్‌ ప్రసాద్, రాజ్‌భవన్‌ అధికారులు, సిబ్బందితోపాటు ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర శాఖ చైర్మన్‌ డాక్టర్‌ ఎ.శ్రీధర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పరిఢా తదితరులు గవర్నర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.  

మరిన్ని వార్తలు