దాతల స్పందన ప్రశంసనీయం: గవర్నర్‌

2 Jul, 2021 05:12 IST|Sakshi

సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో విభిన్న రంగాలకు చెందిన దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో సింగపూర్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సమకూర్చిన 100 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, 48వేల టెస్టింగ్‌ వయల్స్‌ను ఆయన రాష్ట్ర రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌  డాక్టర్‌ ఎ.శ్రీధర్‌రెడ్డికి అందించారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ హరిచందన్‌ మాట్లాడుతూ.. తమ దాతృత్వం సద్వినియోగం అవుతుందనే నమ్మకం కలిగిస్తే ఎందరో దాతలు మరింతగా ముందుకు వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. కరోనా రోగులకు సేవలు అందించేందుకు సింగపూర్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ రూ.4.50కోట్ల విలువైన పరికరాలను అందించిందని రాష్ట్ర రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శి ఏకే ఫరిడా చెప్పారు. గవర్నర్‌ కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా, సంయుక్త కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్‌ పాల్గొన్నారు.  

వైద్యుల సేవలు నిరుపమానం
వైద్యులు నిస్వార్థ సేవతో మానవాళికి అద్వితీయమైన రీతిలో సేవలు అందిస్తున్నారని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రశంసించారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఆయన వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్యులు విశేషరీతిలో సేవలు అందిస్తున్నారని ఆయన గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.    

మరిన్ని వార్తలు