స్వాతంత్య్ర పోరాటాలు, హక్కుల ఉద్యమాలకు గాంధీజీ ప్రేరణ

15 Aug, 2022 03:25 IST|Sakshi

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ 

30 అడుగుల జాతిపిత కుడ్య చిత్రం ఆవిష్కరణ 

సాక్షి, అమరావతి/విజయవాడ సెంట్రల్‌: దేశాన్ని స్వాతంత్య్రం వైపు నడిపించడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా స్వాతంత్య్ర పోరాటాలు, హక్కుల ఉద్యమాలకు మహాత్మా గాంధీ ప్రేరణగా నిలిచారని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా సర్వోదయ ట్రస్ట్‌ నేతృత్వంలో విజయవాడలోని స్వాతంత్య్ర సమర యోధుల భవన్‌లో గాంధీజీ 30 అడుగుల కుడ్య చిత్రాన్ని ఆదివారం గవర్నర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో గవర్నర్‌ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్న తరుణంలో ఆగస్టు 15 వరకు తమ నివాసాలపై ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. ఇది దేశాన్ని ఐక్యత దిశగా నడిపే ‘ఏక్‌ భారత్‌–శ్రేష్ట భారత్‌’దిశగా పయనింపచేస్తుందన్నారు.

జాతీయ జెండా ఎగురవేస్తున్న గవర్నర్‌ హరిచందన్‌.30 అడుగుల మహాత్మాగాంధీ కుడ్య చిత్రం  
 
దేశభక్తుల భూమి ఆంధ్రా 
స్వాతంత్య్ర సమర వీరులు, దేశభక్తుల భూమి ఆంధ్రప్రదేశ్‌ అని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంతు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు వంటి స్వాతంత్య్ర సమరయోధుల సేవలు ఎన్నటికీ మరువలేనివన్నారు. కృష్ణా జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల సంఘం గాంధేయ తత్వానికి నాడీ కేంద్రంగా పని చేస్తుండటం గొప్ప విషయమన్నారు.

స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని రాబోయే తరాలకు అందించే లక్ష్యంతో సర్వోదయ ట్రస్ట్‌ పనిచేస్తుండటం ముదావహమన్నారు. సుప్రసిద్ధ స్వాతంత్య్ర సమరయోధుడు గద్దె లింగయ్య పేరిట గ్రంథాలయం నిర్వహించటం అభినందనీయమని పేర్కొన్నారు. పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ, సర్వోదయ ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్‌ జీవీ మోహనప్రసాద్, కలెక్టర్‌ ఢిల్లీరావు, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, స్వాతంత్య్ర సమరయోధురాలు మనోరమ, ట్రస్ట్‌ సభ్యుడు డాక్టర్‌ ఎంసీ దాస్, సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మోతుకూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు