సాగులో మార్పులు తేవాలి

16 Sep, 2022 05:47 IST|Sakshi

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో గవర్నర్‌ 

సాక్షి, బాపట్ల: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి, రైతుల సమస్యల పరిష్కారానికి ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం కృషిచేయాలని రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ చాన్స్‌లర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 54వ స్నాతకోత్సవం గురువారం నిర్వహించారు.  వర్చువల్‌గా పాల్గొన్న గవర్నర్‌ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో  విప్లవాత్మక  యూనివర్సిటీ శ్రీకారం చుట్టిందని, డ్రోన్‌ల వినియోగ పరిశోధనలో దేశంలోనే యూని వర్సిటీ ముందుండటం గర్వకారణమన్నారు.  

తలసరి ఆదాయంలో ఏపీ అగ్రగామి : ప్రొఫెసర్‌ రమేష్‌ చంద్‌  
ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్‌ సభ్యుడు ప్రొఫెసర్‌ రమేష్‌ చంద్‌ మాట్లాడుతూ రాష్ట్ర తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే ఆంధ్రప్రదేశ్‌లో 38.6 శాతం అధికంగా నమోదైందని, ఇది రాష్ట్ర అరి్థక ప్రగతికి సూచికని చెప్పారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,07,771 కాగా, దేశ తలసరి ఆదాయం రూ.1,49,848 మాత్రమే అని తెలిపారు. 2011 నుంచి 2021 వరకు జాతీయ స్థూల ఉత్పత్తి పెరుగుదల 5.48 శాతం కాగా, రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల 7.08 శాతం ఉందన్నారు.

కేవలం వ్యవసాయ అనుబంధ రంగాలు 8 శాతం వృద్ధి నమోదు చేశాయని, ఇది భారతదేశ వృద్ధికి రెండు రెట్లు అధికంగా ఉందని వివరించారు. దేశ వృద్ధి రేటు 3.28 మాత్రమేనని వివరించారు. యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంపై నివేదిక సమర్పించారు. గిరిజన వ్యవసాయ విధానాలపై అత్యుత్తమ పరిశోధనలు చేసిన విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానానికి చెందిన ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌కు యూనివర్సిటీ పురస్కారం ప్రదానం చేసినట్లు తెలిపారు.  722 మందికి డిగ్రీ, 102 మందికి పీజీ, 40 మందికి పీహెచ్‌డీ పట్టాలను ప్రదానం చేశారు.    

మరిన్ని వార్తలు