బాలల విద్యకు బలమైన పునాదులు వేసిన నెహ్రూ

14 Nov, 2021 03:09 IST|Sakshi
ఢిల్లీలో గవర్నర్‌కు అభివాదం చేస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా

బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ విశ్వభూషణ్‌

సాక్షి, అమరావతి: భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ బాలల విద్యకు బలమైన పునాదులు వేసారని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ కొనియాడారు. పండిట్‌ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఏటా నవంబర్‌ 14న బాలల దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ సందర్భంగా రాష్ట్రంలోని చిన్నారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు గవర్నర్‌ కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. బాలలు భారతీయ సమాజానికి వెన్నెముకగా పండిట్‌ నెహ్రూ భావించారన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే ఆర్యోక్తిని అనుసరించి దేశ భావిపౌరులుగా మాతృభూమిని కాపాడుతూ, భారతావనికి ఉజ్వల భవిష్యత్తును నిర్మించాల్సిన బాధ్యత బాలలపై ఉందని గవర్నర్‌ అభిప్రాయపడ్డారు. 

గవర్నర్‌ను కలిసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా శనివారం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. ఢిల్లీ వెళ్లిన గవర్నర్‌ను ఏపీ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొద్దిసేపు మాట్లాడారు. 

మరిన్ని వార్తలు