వెరైటీ ఆచారం: వధువు వరుడుగా.. వరుడు వధువుగా..  

8 Aug, 2021 12:48 IST|Sakshi
పెళ్ళికుమార్తె వేషధారణలో వరుడు(ఫైల్‌)

 వివాహ వేడుకలో వింతైన అలంకారం

ఆసక్తికరం గన్నమని వారి వంశాచారం

తరాలు మారినా.. సంప్రదాయానికే జై కొడుతున్న నేటి తరం 

ఆ వంశస్తుల ఇంట పెళ్లంటే సందడే కాదు.. తరతరాలుగా వస్తున్న విచిత్ర సంపద్రాయాల మేళవింపు.. అందుకే నల్లజర్ల మండలం పోతవరంలో గన్నమని వారింట పెళ్లంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. పెళ్లి కుమారుడు పట్టుచీర కట్టుకుని, నడుముకు వడ్డాణం, చేతికి అరవంకి పెట్టుకుంటే చుట్టూ చేరిన అమ్మలక్కలు అతనిని చూసి మురిసిపోతారు. ఇక ఆ ఇంట అమ్మాయి పెళ్లికూతురైతే టిప్‌టాప్‌గా ప్యాంటు, షర్టు వేసుకుని చలువ కళ్లద్దాలు పెట్టుకుని ఠీవిగా పోజులిస్తుంది. పెళ్లికి ఒకరోజు ముందు జరిగే ఈ తంతు కనువిందుగా సాగిపోతుంది. అమ్మవారి మొక్కు తీర్చుకునే క్రమంలో చేపట్టే ఈ వేషధారణను ఆ వంశస్తులు కాపాడుకుంటూ వస్తున్నారు. 

జిల్లాలో గన్నమని ఇంటి పేరున్న అమ్మాయి పెళ్లి జరిగితే అబ్బాయిగా అలంకరిస్తారు. ఆ ఇంటి పేరున్న అబ్బాయికి పెళ్లయితే అమ్మాయిగా ముస్తాబు చేస్తారు. పెళ్లికి ఒకరోజు ముందు ఇలా అలంకరించి కులదేవతకి బోనం సమర్పిస్తారు.

నల్లజర్ల: పెళ్లంటే పందిళ్లు, సందళ్లు, తాళాలు, తలంబ్రాలే కాదు.. వింత ఆచారాల కలయిక. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కుటుంబానికి ఒక విలక్షణ ఆచారం కొనసాగింపుగా వస్తుంది. జిల్లాలోని గన్నమని ఇంటి పేరున్న వారు కాకతీయుల కాలం నుంచి విభిన్న ఆచారం పాటిస్తున్నారు. ఆ సంప్రదాయాన్ని నేటి తరం కూడా ఆచరిస్తూ కనువిందు చేస్తోంది. గన్నమని వారింట వివాహం జరిగితే ఆ ఇంటి పేరున్న అమ్మాయిని అబ్బాయిగా అలంకరిస్తారు. అలాగే గన్నమని ఇంటిపేరున్న అబ్బాయికి పెళ్లి జరిగితే పెళ్ళికి ముందు రోజు అమ్మాయిగా ప్రత్యేక దుస్తుల్లో అలంకరిస్తారు. కులదేవత ఆలయానికి లేదా గ్రామ దేవత ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి మొక్కులు తీర్చుతారు.

ఈ ఆచారాన్ని బోనంగా పిలుస్తారు. పెళ్ళికుమార్తెకు ప్యాంటు, షర్టు కట్టి వరుడి వేషం వేయిస్తారు. అబ్బాయికైతే పట్టుచీర, జాకెట్‌ కట్టి ఆభరణాలు అలంకరించి తెలుగింటి పెళ్లికూతురిగా ముస్తాబు చేస్తారు. అలా ముస్తాబు చేసిన వధువు లేదా వరుడ్ని బాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామమంతా ఊరేగిస్తారు. గ్రామ దేవత ఆలయానికి తీసుకెళ్ళి ప్రత్యేక పూజలు చేయిస్తారు. గొర్రెను బలిచ్చి అన్నంతో కుంభం సమర్పిస్తారు. ముడుపులు, మొక్కుబడి చెల్లించుకుంటారు.

పోతవరంలో వరుడి వేషంలో పెళ్లికుమార్తె(ఫైల్‌)- పెళ్ళికుమార్తె వేషధారణలో ప్రభుప్రసాద్‌(ఫైల్‌) 

కాకతీయుల కాలం నుంచీ ఆచారంగా..  
ఈ ఆచారం కాకతీయుల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. రుద్రమదేవి వద్ద గన్నమని వంశస్తుల మూల పురుషుడు సైన్యాధ్యక్షుడిగా ఉండేవాడు. ఆయన హయాంలో సైన్యంలో ఉన్న మగవారు యుద్ధంలో ఎక్కువగా చనిపోవడంతో మహిళలు మగవారి వేషధారణలో సైన్యంలో విధులు నిర్వర్తించేవారు. ఈ విషయం బయటకు తెలియకుండా కాపాడమని కులదేవతను వేడుకునేవారు. పెళ్లి సమయంలో ఆడవారికి మగ వేషం, మగవారికి ఆడవేషం వేసి మొక్కులు చెల్లిస్తామని ప్రార్థించేవారు. అప్పటి నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది.

సంప్రదాయాన్ని కాపాడుకుంటున్న యువత  
ఈ విచిత్ర ఆచారాన్ని గన్నమని ఇంట నేటి యువత ఎంతో ఆసక్తి అనుసరిస్తున్నారు. తమ వంశాచారం పాటించడానికి ఎలాంటి ఇబ్బందీ లేదని చెబుతున్నారు. వారి వంశంలో ఎవరి ఇంట పెళ్ళైనా ఇదే ఆచా రాన్ని పాటిస్తామంటున్నారు.

మా ఆచారాన్ని మర్చిపోం 
ఎన్ని చదువులు చదివి ఏ దేశానికి వెళ్లి ఉద్యోగం చేస్తున్నా మా సంస్కృతీ సంప్రదాయాన్ని మరిచిపోం. అందుకే పెద్దలు చెప్పినట్లుగా విని పెళ్లిలో మా వంశాచారం పాటిస్తున్నాం. 
– భాను ప్రసాద్, అనంతపల్లి 

సంప్రదాయాన్ని గౌరవించాలి 
భారతీయ సంప్రదాయాలపై పాశ్చాత్య దేశాల్లోనూ చాలా గౌరవం ఉంది. మన సంప్రదాయాన్ని మనం గౌరవించాలి. పెళ్లిలో వేషధారణ గురించి పెద్దవాళ్ళు చెప్పారు. మేం కూడా ఆ ఆచారాన్ని అలా కొనసాగిస్తున్నాం. 
– డాక్టర్‌ మానస, పోతవరం 

అనాదిగా వస్తున్న ఆచారం 
ఈ ఆచారం కొనసాగడానికి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. గన్నమని ఇంటి ఆడపడుచు రోజూ పుట్టెడు బియ్యం తినేది. పురుషుడి వలే ప్రవర్తించేది. ఎవరూ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. అపుడు గ్రామ దేవతకు మొక్కి తమ కుమార్తెకు వివాహం జరిగితే మగవేషం వేసి మొక్కులు చెల్లిస్తామని తల్లిదండ్రులు వేడుకున్నారు. ఆమెకు పెళ్లి ముందురోజు పెళ్లికొడుకు వేషం వేసి ఆలయానికి ఊరేగింపుగా గుడికి వెళ్ళి మొక్కులు చెల్లించిన ట్లు పూర్వీకులు చెబుతారు. అప్పటి నుంచి అదే ఒరవడి కొనసాగుతుంది. 
– గన్నమని రాము, పోతవరం 

సంతానం నిలవడం కోసం.. 
గన్నమని వంశంలో పుట్టిన మగపిల్లలు అందరూ చనిపోయే వారు. పుట్టిన సంతానం నిలవడం కోసం గ్రామ దేవతకు మొక్కుకోవడంతో వారి కోరిక ఫలించింది. అప్పటి నుంచి మగపిల్లలకు ఆడవేషం, ఆడపిల్లలకు మగవేషం వేసి గ్రామదేవత గుడికి ఊరేగింపుగా వెళ్ళి  మొక్కులు చెల్లిస్తున్నాం. ఆ సమయంలో పొట్టేలు బలి ఇస్తారు.  
– రామ దుర్గాప్రసాద్, అనంతపల్లి    

మరిన్ని వార్తలు