మా కార్యకర్తల ప్రమేయం లేదు

17 Jan, 2021 05:23 IST|Sakshi
ముద్రగడతో మాట్లాడుతున్న సోము వీర్రాజు

డీజీపీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ

సాక్షి, అమరావతి/ప్రత్తిపాడు: రాష్ట్రంలో ఆలయాలపై దాడుల ఘటనల్లో బీజేపీ కార్యకర్తల ప్రమేయం ఎంత మాత్రం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు లేఖ రాశారు. ఆలయాలపై దాడుల ఘటనలకు సంబంధించి కొందరు బీజేపీ కార్యకర్తల ప్రమేయం ఉందంటూ డీజీపీ ప్రకటించినట్టు కొన్ని పత్రికల్లో కథనాలు ప్రచురితం కావడంతో పాటు టీవీలో స్క్రోలింగ్‌ వెలువడడాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. విగ్రహాలను దెబ్బతీసే పనిలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారనే తప్పుడు అభిప్రాయాన్ని ఈ ప్రకటనలు తెలియజేస్తున్నాయని.. సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టడం, విగ్రహాలపై దాడుల ఘటనలు రెండు వేర్వేరు అంశాలుగా సోము వీర్రాజు పేర్కొన్నారు. దీనిపై డీజీపీ వివరణ ఇవ్వాలని, లేకుంటే పరువు నష్టం దావా వేస్తామన్నారు. 

ముద్రగడతో సోము భేటీ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో శనివారం భేటీ అయ్యారు. ముద్రగడ నివాసానికి చేరుకున్న సోము.. అరగంటకు పైగా చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీతో కలిసి బీజేపీ ముందుకెళ్తున్న పరిస్థితుల పై వివరించినట్టు చెప్పారు. అలాగే సుదీర్ఘమైన అంశాలను ఉంచానని, వాటిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానన్నారని సోము వీర్రాజు చెప్పారు.   

మరిన్ని వార్తలు