ద్వితీయ స్థానం కోసం.. బీజేపీ, టీడీపీ పోటాపోటీ ఖర్చు

7 Apr, 2021 04:45 IST|Sakshi

రూ.వంద కోట్లు వెచ్చించేందుకు ఇరుపార్టీలు రెడీ 

టీడీపీ ఎన్నికల ఖర్చు భరిస్తున్న ఓ డాక్టర్‌ 

ఖర్చులు భరించేందుకు ఇద్దరు బీజేపీ ఎంపీలూ సంసిద్ధత 

విరాళాలు సేకరిస్తున్న కమలనాథులు 

కర్ణాటక నుంచి పెద్దఎత్తున మద్యం దిగుమతి 

సాక్షి, తిరుపతి:  తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలో ద్వితీయ స్థానం కోసం పోటీపడుతున్న బీజేపీ, టీడీపీలు విచ్చలవిడిగా డబ్బు వెదజల్లుతున్నాయి. ఒక్కో పార్టీ రూ.100 కోట్లు వరకు ఖర్చుచేసేందుకు సిద్ధమయ్యాయి. డబ్బుల పంపిణీ, రోజువారీ ఖర్చు కోసం ఇప్పటికే కొందరికి బాధ్యతలు అప్పగించారు. టీడీపీ విషయానికి వస్తే.. వచ్చే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ స్థానంతోపాటు చిత్తూరు జిల్లాలో మరో అసెంబ్లీ స్థానం కేటాయిస్తామని ఓ మహిళా వైద్యురాలికి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆమె సోదరుడి ద్వారా టీడీపీ పెద్దలు ఈ ప్రతిపాదన పంపినట్లు సమాచారం. దీంతో ఆమె నుంచి తిరుపతి ఉప ఎన్నికకు అయ్యే మొత్తం ఖర్చు పెట్టిస్తున్నట్లు తెలిసింది. ఇక టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తాను ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేనని అధినేత చంద్రబాబుకు ముందే తేల్చిచెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకు ఒప్పుకుంటేనే తాను బరిలో ఉంటానని మాజీమంత్రి ద్వారా సమాచారం అందించారు. ఎన్నికకు అయ్యే ఖర్చు పెట్టేందుకు సదరు మహిళా డాక్టర్‌ ముందుకొచ్చాకే పనబాక లక్ష్మి ప్రచారంలోకి దిగినట్లు పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. కాగా, గత కొద్దిరోజులుగా ప్రతి బూత్‌ పరిధిలో ఖర్చుల కోసం రోజుకు రూ.25 వేలు చొప్పున వెచ్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.  

బీజేపీ కూడా ఖర్చుకు సై 
అయితే, ద్వితీయ స్థానం దక్కించుకునేందుకు టీడీపీ భారీ మొత్తంలో ఖర్చుకు వెనుకాడడంలేదని తెలుసుకున్న కమలనాధులు తాజాగా సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో వెనుకడుగు వేస్తే ఢిల్లీ పెద్దల వద్ద మాటపడాల్సి వస్తుందని, అందుకని వారు కూడా ఖర్చుకు తగ్గకూడదని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కొందరు పారిశ్రామికవేత్తల నుంచి విరాళాలు సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాక.. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజ్యసభ సభ్యులు ఇద్దరూ ఎన్నికలకు అయ్యే ఖర్చులో తాము భాగస్వాములం అవుతామని హామీ ఇచ్చారు. చివరికి టీడీపీకి ఏ మాత్రం తగ్గకుండా ఖర్చుచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ శ్రేణులు వెల్లడించాయి. మరోవైపు.. ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు బీజేపీ, టీడీపీ శ్రేణులు కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున మద్యం దిగుమతి చేసుకున్నట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు