కృష్ణ జింక.. కేరాఫ్‌ లంక

31 Jul, 2022 09:39 IST|Sakshi

ఒత్తిడికి లోనైతే చనిపోతాయి

వాటికి ఆవాసంగా గోదావరి లంకల్లోని ఇసుక దిబ్బలు

వరదల ధాటికి బయటకు రావడంతో గుర్తింపు

ధవళేశ్వరం నుంచి యానాం వరకు లంకల్లో వందల సంఖ్యలో  ఉన్నట్టు అంచనా

సాక్షి, అమరావతి : గోదావరి లంకల్లో కృష్ణ జింకలు పెద్ద ఎత్తున ఉన్నట్టు స్పష్టమైంది. ఇటీవల వచ్చిన వరదలతో లంకలు మునిగిపోయి అవి బయటకు రావడంతో ఈ విషయం వెల్లడైంది. లంకల్లో ఎవరికీ కనిపించకుండా వందల సంఖ్యలో జింకలున్నట్టు తేలింది. వాటి ఆవాసాలుగా ఉన్న ఇసుక దిబ్బలను వరద నీరు ముంచెత్తడంతో అవి సమీపంలోని గ్రామాల్లోకొచ్చాయి. అలా వచ్చిన కొన్ని కుక్కల దాడికి గురయ్యాయి. ధవళేశ్వరం బ్యారేజీ సమీపంలో కడియం మండలం వేమగిరి పులసల లంకలో భారీగా వాటి ఉనికి ఉన్నట్టు తేలింది. అప్పుడప్పుడూ బ్యారేజీ దిగువన సందర్శకులకు అవి తారసపడుతుండేవని చెబుతుంటారు. 

ఈ లంక ఎత్తుగా ఉండటంతో ఎంత వరద వచ్చినా మునిగేది కాదు. దీంతో కృష్ణ జింకలకు ఎప్పుడూ ఇబ్బంది ఎదురవలేదు. ఈ సారి మాత్రం రికార్డు స్థాయిలో వరద రావడంతో పులసల లంక నీట మునిగింది. వరద ఉధృతికి కొన్ని జింకలు కొట్టుకుపోగా.. మరికొన్ని గోదావరిని ఈదుకుంటూ సమీపంలోని గ్రామాలకొచ్చాయి. అలా వచ్చిన వాటిపై కుక్కలు దాడి చేయడంతో కొన్ని మృతి చెందాయి. వరదల వల్ల ఆహారం అందక, జనం మధ్యలో ఇమడ లేకపోయాయి. కొన్నింటిని రైతులు సజీవంగా పట్టుకుంటున్నా కొంత సేపటికే అవి మృతి చెందుతున్నాయి. ఇలా 20 జింకలను స్థానికులు పట్టుకోగా వాటిలో మూడు మృతి చెందాయి. మిగిలిన వాటిని అటవీ శాఖాధికారులు రక్షించి చికిత్స చేస్తున్నారు.  

త్వరలో వివరాల సేకరణ   
జింకలు భారీగా ఉన్నట్టు తేలడంతో పూర్తి సమాచారం కోసం అటవీ శాఖాధికారులు తొలిసారి సర్వే నిర్వహించనున్నారు. లంకల్లో వాటి వాస్తవ సంఖ్య, వాటి ఆహారపు అలవాట్లు, వాటికున్న ప్రమాదాలతో పాటు.. ఎంత వరద వస్తే వాటికి ఇబ్బంది కలుగుతుందనే వివరాలను సేకరిస్తారు. వరద పూర్తిగా తగ్గాక ఈ సర్వే ప్రారంభిస్తామని రాజమండ్రి డీఎఫ్‌వో సెల్వం చెప్పారు. సర్వే తర్వాత వాటి పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

పూర్తి సమాచారం కోసం సర్వే చేయనున్న అటవీ శాఖ
కృష్ణ జింకలు ఒత్తిడికి లోనైతే ప్రాణాలు కోల్పోతాయి. ఒక్కసారిగా జనాలను చూసినా అవి హడలిపోయి ప్రాణాలు కోల్పోతాయి. మూడు జింకలు అలాగే చనిపోయి ఉంటాయని అటవీ శాఖాధికారులంటున్నారు. జింకల సమాచారం తెలిసిన వెంటనే అటవీ శాఖాధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి లంక ప్రాంతాల్లో బోట్లపై గాలించారు. గోదావరితో పాటు వాటి పాయలైన గౌతమి, వశిష్ట, వైనతేయి, వృద్ధ గౌతమి పరిధిలోని లంకను కృష్ణ జింకలు ఆవాసాలుగా మార్చుకున్నాయి. గోదావరి మధ్యలో ఎత్తుగా గడ్డి పెరిగే ఇసుక దిబ్బల్లో ఇవి స్వేచ్ఛగా తిరుగుతున్నట్టు తేలింది. ఆ లంకల్లోకి ఎవరూ వెళ్లే అవకాశం లేకపోవడంతో వాటి సంఖ్య భారీగా ఉంటుందని గుర్తించలేదు. తాజా అంచనాల ప్రకారం ధవళేశ్వరం నుంచి యానాం వరకూ ఉన్న లంకల్లో అవి వందల సంఖ్యలో ఉన్నట్టు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు