ఆరోగ్యశ్రీలోకి 'బ్లాక్‌ ఫంగస్‌'

18 May, 2021 04:29 IST|Sakshi

బోధనాస్పత్రులు, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స

వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌  

సాక్షి, అమరావతి: కరోనా నుంచి కోలుకున్న తర్వాత బ్లాక్‌ ఫంగస్‌ (మ్యుకర్‌ మైకోసిస్‌) వ్యాధికి గురవుతున్న వారి చికిత్సలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి, అందుకయ్యే ఖర్చును మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించనుందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. దీనికోసం అన్ని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లోనూ, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ పరిధిలోనూ వైద్యం చేసే విధంగా ఆదేశించామని తెలిపారు. సోమవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో బ్లాక్‌ఫంగస్‌ కేసులు నమోదైనా ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. దీనికి సంబంధించిన ఇంజక్షన్లు కొన్నింటిని కేంద్రం కేటాయించిందని, మిగతా వాటిని రాష్ట్ర ప్రభుత్వం షార్ట్‌ టెండర్స్‌ నిర్వహించి కొనుగోలు చేస్తుందని తెలిపారు.

కోవిడ్‌తో అమ్మానాన్నలను కోల్పోయి అనాథలైన చిన్నారుల కోసం రూ. 10 లక్షల చొప్పున డిపాజిట్‌ చేయాలని సీఎం ఆదేశించారన్నారు. కర్ఫ్యూ తర్వాత రెండు జిల్లాల్లో కేసులు తగ్గాయని, మరికొన్ని జిల్లాల్లో నిలకడగా ఉన్నాయని, అందుకే ఈ నెల 31 వరకూ కర్ఫ్యూ పొడిగించాలని సీఎం నిర్ణయించారని వివరించారు. ఫీవర్‌ సర్వే ద్వారా ఇప్పటివరకూ 91 వేల మందికి జ్వర లక్షణాలున్నట్టు గుర్తించామని, వీరి ఆరోగ్యంపై రోజువారి పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్లలో 67 శాతం మంది బాధితులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందుతోందన్నారు. కోవిడ్‌ విధుల్లోకి 17,901 మంది సిబ్బందిని తీసుకున్నామని, అవసరమైతే మరింత మందిని నియమిస్తామని సింఘాల్‌ వెల్లడించారు. ఆక్సిజన్‌ వృథా కాకుండా నేవీ బృందాలు చేస్తున్న సాయం అభినందనీయమన్నారు. 

సీమ జిల్లాల్లో 7 కేసులు
రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్‌ ఫంగస్‌ కేసులపై ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 2, అనంతపురం జిల్లాలో 2, శ్రీకాకుళం జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 1 చొప్పున నమోదయ్యాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిపైనా పరిశీలన చేస్తున్నారు. ముఖ్యంగా మధుమేహ రోగుల్లో ఈ పరిశీలన జరుగుతోంది. కేసులకు సంబంధించి ఇప్పటికే నిపుణుల అభిప్రాయాలతో చికిత్సలు చేస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. మ్యుకర్‌ మైకోసిస్‌ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, అయినా సరే దీనిపై అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఆదేశాలు జారీచేసింది.  

మరిన్ని వార్తలు