45 ఏళ్లు దాటిన వారే లక్ష్యం..

1 Jun, 2021 06:04 IST|Sakshi

ఆ వయసు వారిలోనే అధికంగా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు

కోవిడ్‌ సోకి మధుమేహం ఉన్న వారిలో అధికంగా నమోదు

97 మంది కోలుకోగా..14 మంది మృతి

సాక్షి, అమరావతి: బ్లాక్‌ ఫంగస్‌ కేసులు 45 ఏళ్లు దాటిన వారిలోనే అధికంగా నమోదవుతున్నాయి. మధుమేహం ఉండి కరోనా వచ్చిన వారిపై ఈ ఫంగస్‌ ఎక్కువగా దాడి చేస్తున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 1,179 మందికి బ్లాక్‌ ఫంగస్‌ సోకినట్టు గుర్తించారు. వీరిలో 1,139 మంది కోవిడ్‌ వచ్చి పోయిన వారే ఉన్నారు. కోవిడ్‌ రాకున్నా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలోనూ 40 మందికి ఇది సోకినట్టు వెల్లడైంది. 18 ఏళ్లు దాటిన వారిలోనూ 415 కేసులుండగా, 18 ఏళ్ల లోపు వారిలో 3 కేసులున్నాయి.

ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు మృతిచెందిన వారు 14 మంది ఉన్నారు. కోవిడ్‌ సోకిన వారిలోనే ఎక్కువగా కేసులొచ్చాయి. అయితే వీరిలో ఎక్కువ మంది మధుమేహ బాధితులే. 1,179 కేసుల్లో 743 మంది షుగర్‌ బాధితులు కోవిడ్‌ సోకిన తర్వాత బ్లాక్‌ఫంగస్‌కు గురయ్యారు. మిగతా వారిలో 251 మంది వ్యాధి నిరోధక శక్తి లేక దీని బారినపడ్డారు. క్యాన్సర్, గుండె జబ్బులు, హైపర్‌ టెన్షన్, కిడ్నీ జబ్బులు వంటి వాటితో బాధపడుతున్న వారిలో 130 మందికి ఈ జబ్బు సోకింది. అలాగే బ్లాక్‌ఫంగస్‌ ముందుగా ముక్కుకు చేరి ఆ తర్వాత కన్ను, మెదడుకు సోకిన వారే ఉన్నారు. వీటినే రినో సెరబ్రల్‌ అంటారు. 618 మంది రినో సెరబ్రల్‌  (ముక్కు, కన్ను సంబంధించిన ఫంగస్‌)తో చికిత్స పొందుతున్నారు. పల్మనరీ అంటే ఊపిరితిత్తుల ఫంగస్‌తో 117 మంది, క్యుటానస్‌ అంటే చర్మసంబంధిత ఫంగస్‌తో 146 మంది చికిత్స పొందుతున్నారు. సాధారణ అవయవాలకు అంటే డెసిమినేటెడ్‌ పరిధిలో ముగ్గురు, అన్‌కామన్‌ ప్రెజెంటేషన్‌(అసాధారణంగా) వచ్చినవి 295 కేసులున్నాయి.

వచ్చే 7 రోజుల్లో  55 వేల ఇంజక్షన్లు అవసరం
బ్లాక్‌ఫంగస్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఇంజక్షన్ల వినియోగం పెరిగింది. తాజా అంచనాల ప్రకారం జూన్‌ మొదటి వారంలో 55 వేలకు పైగా ఇంజక్షన్లు, జూన్‌ రెండో వారంలో 79 వేలకు పైగా ఇంజక్షన్లు అవసరమని అంచనా వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,795 ఇంజక్షన్లు మాత్రమే ఉన్నాయి. బీడీఆర్‌ ఫార్మాస్యుటికల్, ఎల్‌వీకేఏ ల్యాబ్స్, గుఫిక్‌ బయోసైన్సెస్, మైలాన్‌ ల్యాబొరేటరీస్‌కు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చారు. ఒక్కో పేషెంటుకు రోజుకు 6 ఇంజక్షన్లు అవసరమని వైద్యులు చెబుతున్నారు.

రక్తం గడ్డకట్టడం వల్ల కేసులు పెరుగుతున్నాయ్‌
కోవిడ్‌ వల్ల రక్తం గడ్డకడుతోంది. ముక్కు లోపల రక్తనాళాలు గడ్డకడితే టిష్యూల వద్దకు ఫంగస్‌ వచ్చినట్టు తాజాగా గుర్తించారు. రక్తం ఎక్కడైతే సరఫరా కాకుండా గడ్డలు వస్తున్నాయో అక్కడే ఫంగస్‌ చేరుకుంటోంది. కోవిడ్‌కు స్వతహాగానే రక్తాన్ని గడ్డకట్టించే గుణం ఉంది.
–డా.పల్లంరెడ్డి నివేదిత అసిస్టెంట్‌ ప్రొఫెసర్, కర్నూలు ప్రాంతీయ కంటి ఆస్పత్రి

మరిన్ని వార్తలు