బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు రూ.22 లక్షలు తీసుకున్నారు! 

11 Aug, 2021 03:30 IST|Sakshi
బ్లాక్‌ ఫంగస్‌తో ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న విజయలక్ష్మి (ఫైల్‌)

విజయవాడ ప్రభుత్వాస్పత్రి డ్యూటీ డాక్టర్‌పై రోగి భర్త ఫిర్యాదు 

ఆన్‌లైన్‌లో చెల్లించిన రశీదులతో సహా ఫిర్యాదు 

విచారణకు ఆదేశించిన అధికారులు  

వారం కిందటే డీఎం అండ్‌ హెచ్‌వోకు ఫిర్యాదు అందినా ఆస్పత్రికి పంపని వైనం  

లబ్బీపేట (విజయవాడ తూర్పు): బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రిలో చేరితే, ఇంజక్షన్ల కొరత ఉందంటూ ఓ డ్యూటీ వైద్యురాలు తమ వద్ద నుంచి రూ.22 లక్షలు వసూలు చేసిందని ఓ వ్యక్తి వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. తాము చెల్లింపులన్నీ డ్యూటీ డాక్టర్‌ వ్యక్తిగత బ్యాంక్‌ ఖాతాకు జమ చేసినట్లు ఆధారాలతో సహా ఫిర్యాదుకు జత చేయడంతో దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన పొట్టెం విజయలక్ష్మి శరన్‌ ఈ ఏడాది మే 28న బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేరారు.

ఆ సమయంలో ఆ వార్డులో డ్యూటీ డాక్టర్‌గా ఉన్న (కోవిడ్‌ నియామకం) తోట వాణి సుప్రియ లయోఫిలైజుడ్‌ యాంఫోటెరిసిన్‌ బి అనే యాంటి ఫంగల్‌ ఇంజెక్షన్స్‌ కొరత ఉందని, డిమాండ్‌ కూడా ఎక్కువగా ఉందని, ముడుపులు చెల్లిస్తే కానీ ఇంజెక్షన్లు సమకూర్చలేమని చెప్పినట్లు విజయలక్ష్మి భర్త రఘుకులేశ శరన్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విడతల వారీగా తాము రూ.22 లక్షలు డ్యూటీ డాక్టర్‌ వ్యక్తిగత బ్యాంక్‌ ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌కు ఇచ్చిన ఫిర్యాదుతో జత చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం ఉచితంగా యాంటీ ఫంగల్‌ మందులను ఇస్తుంటే, ఇలా బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముకుని సొమ్ము చేసుకోవడం దారుణమని, తమని  మోసం చేసిన డ్యూటీ డాక్టర్‌పై చర్యలు తీసుకుని, ఆమె వెనుక ఉన్న సూత్రధారులపై విచారణ  చేపట్టి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

జేసీ సీరియస్‌.. 
బ్లాక్‌ ఫంగస్‌ రోగి నుంచి రూ.22 లక్షలు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) ఎల్‌.శివశంకర్‌ సీరియస్‌ అయినట్లు తెలిసింది. ఈ మేరకు ఆస్పత్రి అధికారులను తమ కార్యాలయానికి పిలిపించుకుని బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు, ఇతర వివరాలను సేకరించారు. కాగా ఈ విషయమై బాధితులు వారం కిందటే జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి ఫిర్యాదు చేసినా, దానిని ఆస్పత్రి అధికారులకు పంపకుండా వారి వద్దే ఉంచుకున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఘటన వెలుగులోకి రావడంతో హడావుడిగా తమకు వచ్చిన ఫిర్యాదును ఆస్పత్రి అధికారులకు పంపారు.   

విచారణ జరుగుతోంది 
రోగి నుంచి రూ.22 లక్షలు తీసుకున్నట్లు వచ్చిన ఫిర్యాదుపై జేసీ నేతృత్వంలో విచారణ జరుపుతున్నాం. తమకు ఇచ్చిన ఫిర్యాదు వివరాలు మొత్తం జేసీకి ఇచ్చాము. రోగి ప్రభుత్వాస్పత్రి నుంచి వెళ్లిన తర్వాత ఇంటి వద్ద కూడా ఈ వైద్యురాలు చికిత్స చేసినట్లు తెలిసింది. అన్ని విషయాలు విచారణలో తేలుతాయి.
– డాక్టర్‌ ఎం జగన్‌మోహనరావు, సూపరింటెండెంట్‌  

>
మరిన్ని వార్తలు