ఈ బియ్యం.. చక్రవర్తుల బియ్యం

6 Aug, 2021 20:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వేడి వేడి అన్నం ఓ గరిటె ఎక్కువ వేసుకుందామంటే భయం. నెయ్యి, పచ్చడి, పప్పు సాహచర్యంతో మూడు పూటలా తినాలని ఉన్నా సుగర్‌ వస్తుందేమోనని దడ. చపాతీకి వెళ్దామంటే జిహ్వ ఊరుకోదాయె. దీనికో మార్గం వెతకాలి. అన్నం మెతుకును వదలని ఉపాయం అన్వేషించాలి. అందుకో దారుంది. ధవళ వర్ణంలో మెరిసిపోయే అన్నం కంచంలో చూడడం కామన్‌. కానీ అదే కంచంలో నల్లటి మెతుకులకు స్థానం కల్పిస్తే అదీ తెలివి. సాగులో ‘కాలా’నుగుణంగా వచ్చిన మార్పు ఇది. కాలాబాత్‌ అని పిలిచే నల్ల బియ్యం సాగు జిల్లాలోనూ అక్కడక్కడా కనిపిస్తోంది. 

వజ్రపుకొత్తూరు/పాలకొండ రూరల్‌ :  పోషకాల గనిగా భావించే నల్లబియ్యం సాగుకు జిల్లాలో కొందరు ఔత్సాహికులు మొగ్గు చూపుతున్నారు. మరికొందరు సాగును ప్రోత్సహించేలా విత్తనాల్ని అందిస్తున్నారు. ఈ పంటపై ఎందుకంత మక్కువ..? అని ప్రశ్నిస్తే ఇవి చక్రవర్తుల బియ్యం అని గర్వంగా సమాధానమిస్తున్నారు. ఆరోగ్యకరమైన సమాజానికి ఇలాంటి ఆహారం చాలా అవసరమనే ఉద్దేశంతోనే పండిస్తున్నామంటున్నారు. జిల్లాలో ఏయే ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు.. రకాలేమిటి.. ఔషధ విలువలు.. దిగుబడి సంగతులేమిటో నిపుణులు, రైతుల మాటల్లో తెలుసుకుందామా..!

ఎందుకు తినాలి.. 

  • టైప్‌–2 మధుమేహం బారిన పడకుండా రక్తంలో చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచుతుంది.  
  • మధుమేహం, గుండె సంబంధిత, క్యాన్సర్, స్థూలకాయం వంటి రోగాలను నియంత్రించవచ్చు.   
  • ఇన్ఫెక్షన్లు రాకుండా నిరోధిస్తాయి.  
  • మూత్ర పిండాలు, కాలేయం, జీర్ణాశయం బాగా పనిచేసేలా సహకరిస్తాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.  
  • శరీరంలో విషతుల్యమైన పదార్థాలతో శక్తివంతంగా పోరాడుతాయి.

చదువు..కొలువు..సాగు..  
వజ్రపు కొత్తూరు మండలం పూండి–గోవిందపురం గ్రామానికి చెందిన కర్ని సందీప్‌కు వ్యవసాయమంటే మక్కువ. ఒడిశాలోని సెంచూరియన్‌ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్, ఉత్తరప్రదేశ్‌లోని ఓ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ప్రస్తుతం గ్రామ సచివాలయంలో వ్యవసాయ శాఖ సహాయకునిగా పనిచేస్తున్నారు. నల్లబియ్యం విషయం తెలుసుకున్న సందీప్‌ హైదరాబాద్‌లోని తన మిత్రుని వద్ద నుంచి కాలాబాత్‌ రకం విత్తనాలు తెచ్చి తన ఎకరా పొలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తున్నారు. రూ.5 వేల పెట్టుబడితో ఎకరాకు 28 బస్తాలు దిగుబడి వస్తుండటంతో ఈ రకం సాగుకు ప్రచారం కల్పిస్తున్నారు. రైతులకు విత్తనాలు అందిస్తున్నారు.  

పోషకాల కోసమే పండిస్తున్నా..  
పాలకొండ మండలం ఓని గ్రామానికి చెందిన కనపాక అదీప్‌ కుమార్  బ్లాక్‌రైస్‌లో ఉండే ఔషధ విలువల గురించి తెలుసుకున్నారు. తన పొలంలో రెండెకరాల్లో సాగు చేస్తున్నారు. విత్తనాల్ని బూర్జ మండల వ్యవసాయ అధికారుల ద్వారా ఔత్సాహికులకు అందిస్తున్నారు. సేంద్రియ విధానంలో పండించడం వల్ల అధిక దిగుబడులు సాధ్యమని చెబుతున్నారు.   

ఔత్సాహిక రైతులకు ప్రోత్సాహం...  
పాలకొండ మండలం, రుద్రిపేటకు చెందిన కండాపు ప్రసాదరావు  అభ్యుదయ రైతు. ఔషధ గుణాలు కలిగిన నల్లబియ్యం సాగుకు చేయూత నందిస్తున్నారు. ఏటా కొత్తూరు, కొండాపురం, గుడివాడ, పారాపురం, విజయనగరం, విశాఖ తదితర ప్రాంతాల్లో వంద ఎకరాల్లో సాగుకు సరిపడా విత్తనాలు అందిస్తున్నారు. ఇప్పుడున్న జీవనశైలికి అద్భుతమైన ఆహారమని చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు