జంట జబ్బులతో జర భద్రం!

8 Aug, 2022 04:34 IST|Sakshi

రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న బీపీ, సుగర్‌

జీవనశైలి జబ్బుల గుర్తింపు ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ చేపడుతున్న వైద్య ఆరోగ్య శాఖ

ఇప్పటివరకూ మూడు కోట్ల మందికి పైగా స్క్రీనింగ్‌

ఇందులో 1.87 కోట్ల మంది 30 ఏళ్లు పైబడిన వారు

వీరిలో 26.35 శాతం మందిలో రక్తపోటు..

25.64 శాతం మందిలో మధుమేహం ఉన్నట్లు గుర్తింపు 

సాక్షి, అమరావతి : ఉరుకులు పరుగుల జీవితం.. నిరంతరం పనిఒత్తిడి.. మారుతున్న ఆహారపు అలవాట్లు.. వెరసి రాష్ట్రంలో చాలామందిని 30 ఏళ్లకే ‘రక్తపోటు, మధుమేహం’ పలకరిస్తున్నాయి. గతంలో పట్టణాలు, నగర వాసుల్లోని 45 నుంచి 50 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా ఈ జంట జబ్బుల సమస్య కనిపించేది.  ప్రస్తుతం పల్లె, పట్టణం, నగరం అనే తేడాలేకుండా యుక్తవయస్సుల వారూ వీటి బారినపడుతున్నారు.

కోనసీమలో అధికం..
ప్రజల్లోని జీవనశైలి జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా వారికి స్వస్థత కల్పించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఎన్‌సీడీ–సీడీ సర్వే చేపడుతోంది. అందులో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మూడుకోట్ల మందికి పైగా ప్రజలను వైద్య సిబ్బంది స్క్రీనింగ్‌ చేశారు. వీరిలో 1.87 కోట్ల మంది 30 ఏళ్ల వయస్సు పైబడిన వారిగా ఉన్నారు. ఇందులో 26.35 శాతం అంటే 49,54,106 మందిలో రక్తపోటు, 25.64 శాతం అంటే 48,20,138 మందిలో మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. ఇక అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 6,82,189 మందిలో 30 ఏళ్లు పైబడిన వారిని స్క్రీనింగ్‌ చేయగా అత్యధికంగా 38.02 శాతం మందిలో రక్తపోటు, 35.54 శాతం మందిలో మధుమేహం ఉన్నట్లు గుర్తించారు.

ఎన్‌సీడీ క్లినిక్‌ల నిర్వహణ
జీవనశైలి జబ్బుల నియంత్రణలో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఎన్‌సీడీ క్లినిక్‌లు నిర్వహిస్తోంది. 17 జిల్లా, 51 ఏరియా ఆస్పత్రులు, 177 సీహెచ్‌సీల్లో ఈ ఎన్‌సీడీ క్లినిక్‌లు ఏర్పాటుచేశారు. అదే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) స్థాయిల్లోను వీటిని నిర్వహిస్తున్నారు. 

కారణాలివే..
► ఊబకాయం  
► ధూమపానం, మద్యపానం
► తీవ్రఒత్తిడికి లోనవడం
► శారీరక శ్రమ లేకపోవడం
► అతిగా జంక్‌ఫుడ్‌ తినడం 

రక్తపోటు లక్షణాలివే..
తరచూ తలనొప్పి, కళ్లు తిరగడం, కంటి చూపులో మార్పులు, మూర్ఛరావడం జరుగుతుంది. ఎప్పుడూ చికాకుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక్కోసారి ఏదైనా అవయవం దెబ్బతింటే దాని తాలూకు లక్షణాలు బహిర్గతమవుతాయి. కొందరిలో ఎటువంటి లక్షణాలు బయటపడకుండా కూడా ఉంటుంది. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
► శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి
► మధుమేహం, రక్తపోటు బాధితులు సక్రమంగా మందులు వేసుకోవాలి. వైద్యులను సంప్రదిస్తూ ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలి. 
► తేలికపాటి వ్యాయామాలు చేయాలి. రోజు అరగంట పాటు నడక ఉత్తమం.
► తాజా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తినాలి. జంక్, ఫాస్ట్‌ ఫుడ్స్‌ను తినకుండా ఉండటం మంచిది.
► పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు ఖచ్చితంగా బీపీ, షుగర్‌ పరీక్షలు చేయించుకోవాలి. వాటిని కంట్రోల్‌లో ఉండేలా చూసుకోవాలి.
► ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి.  
► గర్భిణులు మధుమేహం బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు మ«ధుమేహం పరీక్షలు చేయించుకోవాలి.

మరిన్ని వార్తలు