రావోయి విహారి.. బోటింగ్‌కు సిద్ధమోయి

18 Apr, 2022 03:52 IST|Sakshi
బోధిసిరి బోటు ఉన్న ప్రాంతం

మరమ్మతులు పూర్తి చేసుకున్న డబుల్‌ డెక్కర్‌ క్రూయిజ్‌ బోధిసిరి 

వారంలో పర్యాటకులకు అందుబాటులోకి  

ఫంక్షన్లు, సమావేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు 

నదీ విహారానికి పోర్ట్, ఇరిగేషన్‌ శాఖల అనుమతులు

సాక్షి ప్రతినిధి, విజయవాడ/భవానీపురం (విజయవాడ పశ్చిమ): ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు చెందిన బోధిసిరి బోటుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. మరమ్మతుల పేరుతో మూడేళ్లపాటు పర్యాటకులకు దూరంగా ఉన్న ఈ డబుల్‌ డెక్కర్‌ క్రూయిజ్‌ వారం రోజుల్లో అందుబాటులోకి రానుంది. రూ.23 లక్షలతో మరమ్మతులు చేసిన బోధిసిరి ఇటీవల బెరంపార్క్‌లో బోటింగ్‌ పాయింట్‌ వద్దకు చేరుకుంది. ప్రస్తుతం దానికి సర్వహంగులు ఏర్పాటు చేస్తూ తుదిమెరుగులు దిద్దుతున్నారు.

కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో పర్యాటకులు ఇప్పుడిప్పుడే దర్శనీయ స్థలాలను, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో బోధిసిరి బోటు నదీ విహారానికి సిద్ధమవడంపై హర్షం వ్యక్తమవుతోంది. బోధిసిరి బోటు వినియోగంలోకి వస్తే కృష్ణానదిలో విహరించేందుకు ఉత్సాహపడే పర్యాటకులకు ఆహ్లాదం కలిగించడమేగాక ఏపీటీడీసీకి మంచి ఆదాయం సమకూరుతుంది. పోర్ట్‌ అధికారుల నిబంధనల మేరకు రూపుదిద్దిన బోధిసిరి బోటుకు పోర్ట్, ఇరిగేషన్‌ శాఖల అనుమతులు కూడా సులువుగానే లభించాయి.  
 
బోటులో నైట్‌ పార్టీ.. 
రెండు దశాబ్దాలుగా పర్యాటకులకు సేవలందిస్తున్న బోధిసిరి బోటు 120 సీటింగ్‌ సామర్థ్యం కలిగి ఉంది. గరిష్టంగా 200 మంది వరకు ఇందులో ప్రయాణం చేయవచ్చు. ఈ బోటును ఫంక్షన్లు నిర్వహించుకునేందుకు కూడా అద్దెకు ఇస్తారు. ఈ భారీ బోటు పైభాగంలో పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి చిన్నచిన్న వేడుకలు నిర్వహించుకోవచ్చు. దీనిమీద చిన్నపాటి వేదిక కూడా ఉంది. బోటు నదిలో విహరిస్తుండగా పార్టీలు చేసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో బోటులో ఏర్పాటు చేసుకునే విద్యుత్‌ లైట్లతో అహ్లాదకరమైన వాతావరణంలో వేడుకలు జరుపుకొంటే ఆ మజానే వేరని అంటారు ప్రకృతి ప్రేమికులు.

ఇటువంటి ఫంక్షన్లతోపాటు అసోసియేషన్లు, మార్కెటింగ్‌ సంస్థలు వంటివాటి సమావేశాలకు కూడా అనువుగా ఉంటుంది. ఫంక్షన్‌కు లేదా సమావేశానికి వచ్చే అతిథులు భోజనాలు చేసేందుకు కింద ఏసీ సౌకర్యంతో సీటింగ్, టేబుల్స్‌తో పెద్ద హాల్‌ ఉంది. పైన ఆటపాటలతో కనువిందు చేస్తే కింద హాల్లో రుచికరమైన వంటకాలతో విందు భోజనం సిద్ధంగా ఉంటుంది. బోధిసిరి బోటులో నదిలో విహరించేందుకు గతంలో రెండు గంటలకు రూ.10 వేలు వసూలు చేసింది ఏపీటీడీసీ. కార్తికమాసం, పండుగలు, వారాంతపు సెలవుదినాల్లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో బోధిసిరి బోటును వినియోగిస్తుంటారు. 

వారంలో బోటు విహారం 
బోధిసిరి బోటుకు సంబంధించిన పనులు 95 శాతానికి పైగా పూర్తయ్యాయి. చిన్నచిన్న పనులు, స్టిక్కరింగ్, ప్లంబింగ్‌ పనులు మూడు, నాలుగు రోజుల్లో పూర్తవుతాయి. ఇప్పటికే బోటు ట్రయల్‌ రన్‌ పూర్తయింది. బోటుకు సంబంధించిన అనుమతులు వచ్చాయి. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా బోటు షికారు వారం రోజుల్లోనే ప్రారంభం కానుంది. ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు కృష్ణానదిలో బోధిసిరి కనువిందు చేయనుంది.
– సీహెచ్‌.శ్రీనివాసరావు, డివిజనల్‌ మేనేజరు, ఏపీటీడీసీ 

మరిన్ని వార్తలు