ముదురుతున్న సరిహద్దు వివాదం

17 Nov, 2020 09:03 IST|Sakshi
ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్న గ్రామస్తులు

 సాక్షి, కొరాపుట్‌: ఆంధ్ర–ఒడిశా బోర్డర్‌ వివాదాలు రోజురోజుకూ పుంజుకుంటున్నాయి. ఇదివరకు ఉన్న కొఠియా, నారాయణపట్నం సమితిలోని చినకరిభద్ర గ్రామాల సరిహద్దుల వివాదం కంటే ఇటీవల బయటపడిన పొట్టంగి సమితి, సంబయి పంచాయతీలోని సునాబెడ గ్రామ సరిహద్దు వివాదంపై ఉభయ రాష్ట్రాల ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అధికంగా దృష్టి పెడుతున్నారు. ఉభయ రాష్ట్రాల మధ్య సరిహద్దులో ఓ ప్రాంతం వారు పెట్టిన సైన్‌ బోర్డును ఇంకొక ప్రాంతం వారు తొలగించడం వంటి చర్యలు పోటాపోటీగా జరుగుతున్నాయి. ఈ నెల 9వ తేదీన ఒడిశా అధికారులు, ప్రజాప్రతి నిధులు వివాదాస్పద గ్రామమైన సునాబెడకి వెళ్లి, ఆంధ్రప్రదేశ్‌ డుంబిరిగుడ మండలం పేరిట ఏర్పాటు చేసిన సరిహద్దు బోర్డును తొలగించారు.

మళ్లీ అదే ప్రాంతంలో ఒడిశా తరఫున బోర్డును ఏర్పాటు చేశారు. దీనిని వ్యతిరేకించిన సరిహద్దు ఆంధ్రప్రదేశ్‌ గ్రామ ప్రజలు ఆ మరుసటి రోజే ఒడిశా తరఫున ఏర్పాటు చేసిన బోర్డును తీసివేసి, ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఉభయ రాష్ట్రాల మధ్య సరిహద్ద వివాదం ముదురుతోంది. ఇటీవల ఆదివారం రోజున ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలు పార్టీల నేతలు విశాఖపట్నంలో దగ్గరి ఏఓబీలోని 4 గ్రామాల ప్రజలతో సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పాల్గొన్న గ్రామస్తులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, అక్కడి అడవులు, అటవీ భూములు తమవని, ప్రాణత్యాగానికైన సిద్దమవుతాము కానీ ఆ భూభాగాన్ని విడిచేది లేదని నినాదాలు చేసినట్లు సునాబెడ వార్డు మెంబరు ముసురు తవుడు ఇక్కడి అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఈ వివాదంపై సునాబెడ గ్రామస్తులు పొట్టంగి బ్లాక్‌ అధికారులకు, జిల్లా యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే వారికి తగిన రీతిలో మద్దతు, రక్షణ లేదని ఆక్కడి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వివాదం నెలకొన్న గ్రామస్తులకు ఆంధ్రప్రదేశ్‌ అధికారులు, ప్రజాపతినిధులు తమ మద్దతు తెలుపుతున్నారని, కానీ ఒడిశా తరఫున అటువంటి ఆసరా తమకు దొరకడం లేదని అక్కడి వారు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టి ఆంధ్రప్రదేశ్‌ గ్రామస్తులు తమపై జరుపుతున్న బెదిరింపులు, వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని అక్కడి సునాబెడ తదితర సరిహద్దులోని గ్రామస్తులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు