దిగుబడులు వరించాయ్‌

9 May, 2021 03:51 IST|Sakshi
ధాన్యం రాశులు

సాగునీటి ఇబ్బందుల్ని అధిగమించి మంచి దిగుబడులు సాధించిన ఉభయ గోదావరి రైతులు

గోదావరి నదిలో ఫిబ్రవరి నుంచి తగ్గిపోయిన సహజ జలాలు

సీలేరు జలాలను మళ్లించి అన్నదాతల్ని ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వం

ప్రతి ఎకరాకు సాగునీటిని అందించి మాట నిలబెట్టుకున్న సీఎం జగన్‌

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: రాష్ట్ర ధాన్యాగారంగా పేరొందిన ఉభయ గోదావరి జిల్లాల్లో రైతులు ఈ రబీలో సాగునీటి ఇబ్బందులను అధిగమించి మంచి దిగుబడులు సాధించారు. రెండో పంట విరగ పండటంతో రైతుల మోములో ఆనందం తొణికిసలాడుతోంది. పోలవరం ప్రాజెక్ట్‌లో భాగమైన కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం కోసం ఈ సారి అఖండ గోదావరి దిగువన రబీకి క్రాప్‌ హాలిడే ప్రకటించాలని అధికారులు ప్రతిపాదించారు. అయితే.. రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ ప్రతిపాదనలను పక్కన పెట్టించారు. కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణాన్ని పూర్తి చేయాలని.. అదే సందర్భంలో గోదావరి జిల్లాల్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందించి తీరాలని ఆదేశించారు. గోదావరిలో సహజ ప్రవాహ జలాలు నిండుకున్నా ప్రతి ఎకరాకు సాగునీరివ్వాలనే ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలు చేశారు. ప్రణాళిక ఫలించి ఎకరాకు 48 నుంచి 50 బస్తాల (బస్తా 75 కిలోలు) దిగుబడి రావడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

విషమ పరీక్ష పెట్టినా..
రబీ ప్రారంభంలో అఖండ గోదావరిలో సహజ జలాలు నిండుకున్నాయి. మార్చి నెలాఖరు నాటికే సాగునీటి సరఫరా నిలిపివేయాలని నిర్ణయించారు. ఒక పక్క కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణ అంశం, మరో పక్క తగ్గిన గోదావరి ఇన్‌ఫ్లోతో సాగు నీటిఎద్దడి ప్రభుత్వానికి తొలుత విషమ పరీక్ష పెట్టాయి. ముందస్తు ప్రణాళికతో స్వల్ప వ్యవధిలో చేతికొచ్చే వరి రకాలు సూచించి.. వెదజల్లు సాగు విధానాన్ని ప్రోత్సాహించారు. ఫలితంగా ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షన్నర హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో రైతులు వెదజల్లు పద్ధతికి ముందుకొచ్చారు. అనుకున్నట్టుగానే దిగుబడిలో కూడా సక్సెస్‌ అయ్యారు. గత రబీతో పోల్చుకుంటే ఈసారి దిగుబడి ఎకరాకు 75 కిలోలు అధికంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఇటీవల వ్యవసాయ శాఖ సమీక్షలో స్పష్టం చేశారు.

 రైతు పొలంలో ధాన్యం దిగుబడి శాతం లెక్కిస్తున్న వ్యవసాయ అధికారులు   

ఫలించిన ప్రణాళిక
ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజీ నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లోని తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు సాగునీరు సరఫరా అవుతుంది. మూడు డెల్టాల్లో రబీ వరికి కనీసం 94 టీఎంసీల నీరు అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే, గోదావరి నదిలో సహజ జలాలు 46.21 టీఎంసీలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. దీంతో సీలేరు నుంచి 62.756 టీఎంసీలను గోదావరి నదిలోకి రప్పించి రబీ, తాగునీటి అవసరాల కోసం 98.216 టీఎంసీల నీటిపి విడుదల చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఏప్రిల్‌ 20 వరకూ సాగునీరు విడుదల చేసి ప్రతి ఎకరాకు అందించారు. శివారు భూములకు సైతం నీరందడంతో రైతులంతా ఇబ్బందులు లేకుండా గట్టెక్కారు.

ప్రభుత్వ కృషితో విజయవంతం
ప్రభుత్వ కృషితో రబీ వరి సాగు విజయవంతమయ్యింది. నీటి ఎద్దడి తలెత్తిన సమయంలో సీలేరు నుంచి అదనపు జలాలు విడుదల చేయడంతో పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరు అందించగలిగాం. ప్రతి ఎకరాకు నీరిచ్చాం. తొలుత మార్చి నెలాఖరు నాటికి కాలువలను మూసివేయాలని నిర్ణయించినప్పటికీ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నీటి విడుదల కాలాన్ని  పొడిగించింది. సమష్టి కృషితో రబీని విజయవంతం చేయగలిగాం. 
– ఆర్‌.శ్రీరామకృష్ణ, ఎస్‌ఈ, ధవళేశ్వరం సర్కిల్‌

పంట దక్కుతుందనుకోలేదు
ఈ ఏడాది దాళ్వా తొలి దశలోనే తీవ్ర నీటి ఎద్దడి తలెత్తింది. తడారిపోతున్న పొలాలను చూసి ఈ పంట దక్కదేమో అనుకున్నాం. శివారు భూముల్లోని రైతుల పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సకాలంలో స్పందించి సీలేరు జలాలు విడుదల చేసి మమ్మల్ని ఆదుకున్నారు. మద్దతు ధర కూడా దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో సంతోషంగా ఉంది.
– నరాల నాగేశ్వరరావు, దుగ్గుదూరు, కాజులూరు మండలం

నీరివ్వకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్లం
మా గ్రామంలో ఈ పంటకు నీరు అందదేమోనని ఆందోళన పడ్డాం. వ్యవసాయ అధికారులు ముందునుంచీ హెచ్చరిస్తున్నా దేవుడి మీద భారం వేసి ముందుకెళ్లాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిజంగానే మా పాలిట దేవుడిగా వరమిచ్చారు. సీలేరు నుంచి నీరు తీసుకుని వచ్చి మా పంటలను కాపాడారు. 50 బస్తాల వరకు దిగుబడి వచ్చింది.
–మావిరెడ్డి సుబ్బారావు, రైతు, చోడవరం, రామచంద్రపురం మండలం 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు