సంక్షోభం నుంచి సంక్షేమంలోకి..

7 Nov, 2020 04:36 IST|Sakshi
‘ప్రజా సంకల్పం’ వేడుకల్లో కేక్‌ కట్‌ చేస్తున్న మంత్రులు బొత్స, అనిల్, వేణు, ప్రభుత్వ సలహాదారు సజ్జల, పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, లక్ష్మీపార్వతి తదితరులు

రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న జగన్‌ : బొత్స 

జగన్‌ జీవితం ప్రజలకే అంకితం : సజ్జల 

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ‘ప్రజా సంకల్పం’ వేడుకలు 

సాక్షి, అమరావతి: మహానేత వైఎస్సార్‌ ఎలాగైతే సంక్షేమ పాలనను అందించారో.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా తన తండ్రి బాటలో పయనిస్తూనే ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలిస్తున్నారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మహానేతతో కలిసి పని చేసిన తామంతా.. జగన్, తన తండ్రి మాదిరిగానే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండగలరా.. అని తొలుత ఆలోచించామన్నారు. అయితే తమ సందేహాల న్నింటినీ పటాపంచలు చేసేలా జగన్‌ మొక్కవోని ఆత్మ విశ్వాసంతో ఆశయ సాధన దిశగా పయనిస్తున్నారని ప్రశంసించారు. గత ప్రభుత్వ నిర్వాకాల కారణంగా పలు రకాల సంక్షోభాలతో అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని వైఎస్‌ జగన్‌ గట్టెక్కించడమే కాకుండా, సంక్షేమ పాలనను అందిస్తున్నారని చెప్పారు. వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్‌ ఎంత పవిత్రమైనవో తమకు ఎన్నికల మేనిఫెస్టో కూడా అంతే పవిత్రమైందని చెప్పిన నేతగా జగన్‌ను బొత్స కొనియాడారు. ఏడాదిన్నరలోనే 90 శాతం హామీలను అమలు చేసిన సీఎంగా చరిత్రలో తనకు తెలిసి మరొకరు లేరన్నారు. నవరత్నాలు, సంక్షేమ పథకాల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే ప్రజలతో చర్చించి వాటిని మరింత పటిష్టం చేస్తామన్నారు.  

కుట్రలకు అదర లేదు, బెదరలేదు 
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు), పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జగన్‌ ఉంటే తమకు అడ్డం అనుకున్న ఏ దుష్టశక్తులు కుట్ర చేశాయో తెలియదు గానీ ఆయన్ను అంతమొందించేందుకు యాత్రలో హత్యాయత్నం జరిగిందన్నారు. అయినా ఆయన అదర లేదు.. బెదర లేదన్నారు. మూడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు జగన్‌ తన తండ్రి వైఎస్సార్‌ సమాధి ఇడుపులపాయ సాక్షిగా అశేష జనవాహిని మధ్య పాదయాత్రను ప్రారంభించారని గుర్తు చేశారు. జగన్‌ తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారని చెప్పారు. వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. జగన్‌ సుదీర్ఘ పాదయాత్ర ఈరోజుకీ కళ్ల ముందు కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకులు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. జగన్‌ చేసిన యాత్ర చరిత్రలో నిలిచి పోయిందన్నారు.

పాదయాత్ర ఆసాంతం పాల్గొన్న వారికి సన్మానం 
ఈ కార్యక్రమంలో తొలుత ముఖ్యమంత్రి జగన్‌ను దీవిస్తూ సర్వమత ప్రార్థనలు జరిగాయి. వైఎస్సార్‌ విగ్రహానికి పార్టీ ముఖ్య నేతలంతా నివాళులరి్పంచారు. జగన్‌తో పాటు పాదయాత్రలో ఆసాంతం పాల్గొన్న నేతలు, కార్యకర్తలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగు అకాడమీ చైర్‌ పర్సన్‌ లక్ష్మీ పార్వతి, జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌ కుమార్‌ యాదవ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చల్లా మధు, కనకదుర్గ దేవస్థానం చైర్మన్‌ పైలా సోమినాయుడు, అధికార ప్రతినిధులు, పలువురు నేతలు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు