బీసీ కార్పొరేషన్లకు వారంలో నియామకాలు

1 Oct, 2020 03:26 IST|Sakshi

56 ఏర్పాటు చేయడం ఓ అద్భుతం

ఇచ్చిన మాటను సీఎం జగన్‌ నిలబెట్టుకుంటున్నారు

పేదల సంక్షేమ పథకాలతో ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలమవుతుందా?

చంద్రబాబు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్థం చేస్తే ముఖ్యమంత్రి చక్కదిద్దుతున్నారు: మంత్రి బొత్స

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీసీల అభ్యున్నతి కోసం పెద్దఎత్తున 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నామని, మరో వారం రోజుల్లో వాటి పదవుల్లో నియామకాలు చేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఎన్నికలకు ముందు సీఎం వైఎస్‌ జగన్‌.. బీసీలకిచ్చిన మాట ప్రకారం వీటిని ఏర్పాటుచేసి వారికి రాజకీయ ప్రాధాన్యం, ప్రాతినిధ్యం కల్పిస్తున్నామని ఆయనన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం బొత్స మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. 

► ఎన్నికల ముందు ఏలూరులో భారీఎత్తున బీసీ గర్జన పెట్టాం. ఆ సభలో జగన్‌ మాట్లాడుతూ.. బీసీల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేలా వారి అభ్యున్నతి కోసం అన్ని చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఆ ప్రకారమే 139 బీసీ కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయబోతున్నాం. ఇదో అద్భుతం. 
► రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ కూడా ఏనాడూ ఇలా మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని నెరవేర్చిన సందర్భాల్లేవు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఎన్నో మంచి కార్యక్రమాలను అమలుచేశారు. మళ్లీ నేడు జగన్‌ నేతృత్వంలో అంతకంటే ఎక్కువగా జరుగుతున్నాయి. 
► చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసినప్పటికీ సీఎం జగన్‌ చక్కదిద్దుతున్నారు. 
► కరోనా కష్టకాలంలో కూడా కోట్లాది మందికి సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తుంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలం అంటూ టీడీపీ నాయకులు ఏడుస్తున్నారు. 
► పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తే ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలం అవుతుందా? 
► దేవాలయాల ట్రస్ట్‌ బోర్డులుగానీ, మార్కెట్‌ యార్డు కమిటీలుగానీ, ఇతర కార్పొరేషన్లలోగానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50శాతం అవకాశం కల్పిస్తామని మాట ఇచ్చి ముఖ్యమంత్రి జగన్‌ చట్టం చేశారు. 
► వివిధ స్థాయిల్లో సంప్రదింపులు జరిపి 139 కులాలకు 56 కార్పొరేషన్లు అవసరమని తేల్చారు. వీటికి అధ్యక్షులు, కమిటీలు వేస్తున్నారు. వీటిలో సగం పదవులు బీసీ మహిళలకు ఇస్తున్నారు. బీసీలకు ఇంత గౌరవం దక్కుతున్నందుకు.. జగన్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నందుకు నాకు గర్వంగా ఉంది.   

మరిన్ని వార్తలు