ప్రమాద బాధితులకు పూర్తి సహాయ సహకారాలు

4 Jun, 2023 05:00 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ, చిత్రంలో మంత్రులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, జోగి రమేశ్, కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, సీపీ త్రివిక్రమ్‌ వర్మ

అన్ని కలెక్టరేట్లలో కంట్రోల్‌ రూముల ఏర్పాటు

విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి

కోరమండల్‌లో ఏపీ ప్రయాణికుల సంఖ్య 482

చివరి క్షణంలో రైలు ఎక్కని వారు 82

స్వల్ప గాయాలు, సురక్షితంగా బయటపడిన వారు 287

ఇంకా ఆచూకీ తెలియాల్సిన వారు 113

యశ్వంత్‌పూర్‌ రైలులో 89 మంది.. వీరి ఆచూకీ తెలియాల్సి ఉంది

మహారాణిపేట (విశాఖ దక్షిణ) : ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద బాధితులకు పూర్తి సహాయ, సహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పని చేస్తోందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ ఘటనపై శనివారం ఆయన విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్, కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున, పోలీసు కమిషనర్‌ త్రివిక్రమ్‌ వర్మలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సంఘటనలో రాష్ట్రానికి చెందిన క్షతగాత్రులు, చనిపోయిన వారు, ప్రమాదానికి గురైన వారిని తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు, చనిపోయిన వారిని వారి బంధువులకు అప్పగించేందుకు పూర్తి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ఇప్పటికే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు, ఐపీఎస్‌ అధికారుల బృందం ఒడిశాలోని ఘటనా స్థలికి చేరుకుందని తెలిపారు. మంత్రి బొత్స ఇంకా ఏం చెప్పారంటే..

482 మంది ఏపీ ప్రయాణికులు 
► రైల్వే సమాచారం ప్రకారం ప్రమాదానికి గురైన కోరమండల్‌ రైలులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 482 మంది ఉన్నారు. 309 మంది విశాఖలో దిగవలసి ఉండింది. అయితే వీరిలో 57 మంది ప్రయాణం చేయలేదు. మిగతా వారిలో 165 మంది సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. 11 మంది గాయపడ్డారు. 76 మంది జాడ ఇంకా తెలియాల్సి ఉంది. 

► రాజమండ్రిలో దిగవలసిన 31 మందిలో 22 మంది సురక్షితంగా ఉన్నారు. మిగతా తొమ్మిది మంది సమాచారం తెలియాల్సి ఉంది. విజయవాడలో 137 మంది దిగవలసి ఉండగా, 80 మంది సురక్షితంగా ఉన్నారు. ఏడుగురు గాయపడ్డారు. 22 మంది ప్రయాణం చేయలేదు. 28 మంది ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వస్తోంది. ఏలూరులో దిగాల్సిన ఐదుగురిలో ముగ్గురు ప్రయాణం చేయలేదు. మిగతా ఇద్దరు స్వల్వంగా గాయపడ్డారు.

► యశ్వంతపూర్‌ రైలులో 89 మంది ఆంధ్రప్రదేశ్‌లో దిగవలసిన వారు వున్నారు. ఆదివారం ఉదయానికి పూర్తి సమాచారం అందుతుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ జిల్లాల కలెక్టరేట్లలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశాం. బాధితుల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాం. ఇచ్ఛాపురం నుంచి ఒంగోలు వరకు ఉన్న అన్ని ప్రభుత్వాసుపత్రులను అలర్ట్‌ చేశాం.

► ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఒడిశా రైలు సంఘటన స్థలానికి 108 వాహనాలు 25, ప్రైవేట్‌ అంబులెన్స్‌లు, 15 మహాప్రస్థానం వాహనాలను పంపించాం. నేవీ, ఎయిర్‌ ఫోర్స్, ఇతర శాఖల అధికారుల సహాయం కూడా తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారెవరూ చనిపోయినట్లు సమాచారం లేదు. 

► కటక్, భువనేశ్వర్‌లో రెండు చోట్ల రెండు మెడికల్‌ టీములను ఏర్పాటు చేశాం. సంఘటన స్థలం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారికి ప్రత్యేక ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రయాణికుల బంధువులు వాట్సాప్‌ ద్వారా ప్రయాణికుల ఫొటోలు, వివరాలు ఆయా కలెక్టరేట్లలోని కంట్రోల్‌ రూమ్‌లకు తెలియజేయాలి. 

మరిన్ని వార్తలు