పేదవాడికి ఇళ్లు ఇవ్వడం తప్పా?: బొత్స

25 Dec, 2020 16:46 IST|Sakshi

సాక్షి, విజయనగరం: గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకున్నవారికి అర్హత ఉంటే తొంభై రోజుల్లో ఇంటి స్థలం వస్తుందని మున్సిపల్‌ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పేదలకు పట్టాలివ్వడమే కాక, ఇళ్లు కట్టేందుకు లక్షా ఎనభై వేల రూపాయలు ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. చీపురుపల్లిలో 475 మందికి పట్టాలు వచ్చాయని పేర్కొన్నారు. ఎండకు ఎండి, వర్షానికి తడిచి అద్దె ఇంట్లో ఉంటూ కష్టపడే వారి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాలాకాలంగా తపనపడుతున్నారని చెప్పారు. పేద వాడికి ఇళ్లు ఇస్తామంటే కోర్టుకెళ్తున్నారు.. పేదవాడికి ఇళ్లు ఇవ్వడం తప్పా? అని ప్రశ్నించారు. పేదవాడి జీవన విధానంలో మార్పు తీసుకురావడం కోసం వైఎస్‌ జగన్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. (చదవండి: ఇళ్ల నిర్మాణం ద్వారా కోటి మందికి మేలు)

మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. "కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఇళ్లే తప్ప తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఇళ్ల ఊసే ఎత్తలేదు. దోపిడి, అవినీతి చేయకుండా ఉంటే తిరిగి ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది. కానీ మాకు అధికారం ఇచ్చారంటే ఆ పార్టీ ఎంత  అవినీతినికి పాల్పడిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ప్రభుత్వం భూసర్వే చేస్తే చంద్రబాబు నానా మాటలు అంటున్నారు. ఎక్కడ నుంచో ఎవరో వచ్చి మీ భూమి పట్టుకు పోతారని చెబుతున్నారు. ఇది సిగ్గు చేటు. మీ భూమికి ప్రభుత్వం భరోసా కల్పిస్తుంది. ఎక్కడా లేని విధంగా సర్వే చేయించే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. ఎవరి ప్రమేయం లేకుండా ఇప్పుడు అన్ని పథకాలు అందరికి అందుతుంటే చంద్రబాబు కనీసం మర్యాద కేకుండా మాట్లాడుతున్నారు" (చదవండి: పీలా చెరలో రూ. 300 కోట్లు ప్రభుత్వ భూమి)

"బాబు అయిదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఎవరికీ ఎలాంటి లబ్ధి చేకూరకుండా కేవలం వాళ్ల తాబేదారులకు మాత్రమే అన్ని పథకాలు ఇచ్చేవారు. వైఎస్ఆర్.. ఆరోగ్య శ్రీ పథకం పెట్టి ఎవ్వరూ ఇబ్బంది పడకుండా వైద్యం చేయింకునే విధంగా రూపకల్పన చేశారు.  దీనిని మరింత సులభతరం చేసి మరిన్ని వ్యాధులకు వైద్యం చేయించునే అవకాశాన్ని సీఎం జగన్ కల్పించారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఓట్లడిగిన చంద్రబాబు చివరికి ఇవ్వకుండా మోసం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత విడతల వారిగా ఇస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తొలి విడత రావల్సిన డబ్బును ఇచ్చారు. పెన్షన్ ఇప్పుడు ఇంటికొచ్చి ఇస్తున్నారు. గ్రామ సచివాలయంలలో  లక్షా యాభై వేల ఉద్యోగాలు వచ్చాయి. వీరంతా పరీక్షలు రాసి పారదర్శకంగా ఎంపికయ్యారు" అని బొత్స పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు