మంత్రుల్ని రౌడీలంటారా!

3 Dec, 2020 04:01 IST|Sakshi

ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి వ్యాఖ్యలపై మండలిలో దుమారం  

ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి బొత్స

ఇరుపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం 

మంత్రులకు సభకు వచ్చే హక్కు లేదా అని నిలదీసిన ఉమ్మారెడ్డి  

సాక్షి, అమరావతి: మంత్రులు వీధి రౌడీల మాదిరిగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు బుధవారం శాసన మండలిలో తీవ్ర దుమారం రేపాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీయగా.. ఒక దశలో పరిస్థితి ఇరుపక్షాలు బాహాబాహీ తలపడే స్థాయికి వెళ్లింది. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే.. దీపక్‌రెడ్డి తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని చైర్మన్‌ను కోరుతూ.. మైక్‌ ఇవ్వకముందే మంత్రులపై వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ ఎమ్మెల్సీలు ఓ చోట చేరగా.. బొత్స సత్యనారాయణ తన స్థానం నుంచి పక్కకు వచ్చారు. ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు. చైర్మన్‌ స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకుని ఇలా అయితే సభ ఎలా నడుస్తుందని, సభ్యులు ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని తీవ్ర స్వరంతో ఆదేశించడంతో పరిస్థితి సద్దుమణిగింది.  
మేం దొడ్డిదారిన రాలేదు : మంత్రి బొత్స 
అనంతరం ఈ పరిణామాలపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. తామేమీ దొడ్డిదారిన రాలేదని, మంత్రులంతా ప్రజల ఓట్లతో ఎన్నుకోబడి వచ్చిన వాళ్లేనని, అలాంటి వారిని వీధి రౌడీలని టీడీపీ ఎమ్మెల్సీలు ఎలా అంటారని నిలదీశారు. టీడీపీ సభ్యులు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. ప్రభుత్వం తరఫున మాట్లాడే అవకాశం ఇవ్వరా అని ప్రశ్నించారు. మండలిలో ప్రభుత్వ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. హుందాగా జరగాల్సిన సభలో టీడీపీ ఎమ్మెల్సీలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు. మంత్రులు ఈ సభకు రావడాన్నే వారు తప్పు పడుతున్నారని, మంత్రులకు సభకు వచ్చే హక్కు లేదా అని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రులతో పాటు అధికార వైఎస్సార్‌సీపీ సభ్యులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, కనీసం తన సీటు అయినా మార్చాలని విజ్ఞప్తి చేశారు.  

అభ్యంతరకర వ్యాఖ్యలపై రికార్డుల పరిశీలన 
ఇదిలావుంటే.. మంగళవారం నాటి సభలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీడీపీ ఎమ్మెల్సీ బాబురాజేంద్రప్రసాద్‌ మధ్య చోటుచేసుకున్న వాగ్వావాదం అంశం బుధవారం సభ ప్రారంభం కాగానే చర్చకు వచ్చింది. మంత్రి వెలంపల్లి తనపై చేసిన వ్యాఖ్యలను బాధించాయని, ఆయనతో క్షమాపణలు చెప్పించాలని బాబురాజేంద్రప్రసాద్‌ చైర్మన్‌ను కోరగా.. ఆ సమయంలో జరిగిన పరిణామాలన్నింటిపైనా రికార్డులను పరిశీలించాకే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని మంత్రి బొత్స కోరారు. రికార్డులను పరిశీలించాక అవసరమైతే మంత్రిని, రాజేంద్రప్రసాద్‌ను తన చాంబర్‌కు పిలిపించి మాట్లాడతానని, తర్వాత ఆ విషయాలపై సభలో కూడా ప్రస్తావనకు తీసుకురావచ్చని చైర్మన్‌ సూచించారు. తాను రికార్డులు పరిశీలించే వరకు డిప్యూటీ చైర్మన్‌ సభను నిర్వహిస్తారని చైర్మన్‌ షరీఫ్‌ ప్రకటించారు.   

మరిన్ని వార్తలు