విశాఖ మెట్రో డీపీఆర్‌ త్వరగా పూర్తిచేయండి

22 Oct, 2020 04:23 IST|Sakshi

అధికారులకు మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశం 

సాక్షి, అమరావతి: విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు డీపీఆర్‌ (సవివర నివేదిక)ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని మెట్రో రైలు కార్యాలయంలో బుధవారం ఆయన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, స్పెషల్‌ సెక్రటరీ రామమనోహరరావు, మెట్రో రైలు కార్పొరేషన్‌ ఎండీ రామకృష్ణారెడ్డి తదితరులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టు చేపట్టడానికి అవసరమైన నిధులు, వాటి సమీకరణ మార్గాలను కూడా డీపీఆర్‌లో పొందుపర్చాలని అధికారులకు స్పష్టం చేశారు.

అత్యుత్తమ ప్రమాణాలతో విశాఖ మెట్రో రైల్‌ ఉండేలా ప్రణాళికను రూపొందించాలన్నారు. కోవిడ్‌ కారణంగా డీపీఆర్‌ రూపకల్పనలో ఆలస్యమైందని, త్వరలోనే దీనికి తుదిరూపు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖ  నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు ఏ మార్గాల్లో మెట్రో రైలు ఏర్పాటుకు అవకాశాలున్నాయనే దానిపై చర్చించారు. 75 కిలోమీటర్ల మేర నిరి్మంచే కారిడార్లలో ప్రజలకు సౌకర్యవంతంగా స్టేషన్లు, నిర్వహణ సౌలభ్యం తదితర విషయాల్లో తుది అంచనాలకు వచ్చే ముందు అవసరమనుకుంటే మరోసారి క్షేత్ర స్థాయిలో పర్యటించి అధ్యయనం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.  

మరిన్ని వార్తలు