అనుమతుల ప్రకారమే పోలవరం 

20 Jul, 2022 05:16 IST|Sakshi

భద్రాచలానికి ముంపు కొత్త కాదు.. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఉంది

విలీన గ్రామాలను తెలంగాణలో కలిపేయమనడం సరికాదు

హైదరాబాద్‌ను ఏపీలో కలిపేస్తామంటే ఒప్పుకుంటారా?

తెలంగాణ మంత్రి పువ్వాడపై మంత్రి బొత్స ఆగ్రహం

విలీన మండలాల పూర్తి బాధ్యత ఏపీదేనని స్పష్టీకరణ  

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అనుమతుల ప్రకారమే జరుగుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కొత్తగా ఎత్తు పెంపు అంశం ఎక్కడిదని ప్రశ్నించారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విలీన గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ ఆ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌ చేసిన వ్యాఖ్యలపై బొత్స మండిపడ్డారు. ‘అసలు పోలవరం ఎత్తు ఎప్పుడు పెంచారు? సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఏదీ జరగదు కదా? విభజన చట్టంలో పేర్కొన్న అంశాల ప్రకారమే పోలవరం పనులు చేస్తున్నాం.

భద్రాచలం ముంపు అనేది ఉమ్మడి రాష్ట్రం నుంచే ఉందన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే చాలాకాలం తర్వాత భారీ వరదలు వచ్చాయి. సాంకేతికంగా ఇబ్బందులొస్తే దానిని ఎలా అధిగమించాలి.. ఏ రకంగా శ్రద్ధ తీసుకుంటే బాగుంటుందో తెలుసుకోవాలి. అక్కడా.. ఇక్కడా ఉన్నది ప్రజలే. సమస్య ఎక్కడైనా ఒక్కటే. దాని పరిష్కారానికి మాట్లాడే వ్యక్తులు బాధ్యతగా నడుచుకోవాలి. ముంపు వచ్చింది.. ఇవే కారణాలంటే ఎలా కుదురుతుంది? సమస్యపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు’ అని పువ్వాడ అజయ్‌కు హితవు పలికారు.

హైదరాబాద్‌ను కలిపేస్తారా?
విలీన గ్రామాలను తిరిగి కలిపేస్తామంటున్న తెలంగాణ నాయకులు ఏపీలో హైదరాబాద్‌ను కూడా కలిపేస్తామంటే ఒప్పుకుంటారా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. ‘రాష్ట్ర విభజన వల్ల ఏపీకి హైదరాబాద్‌ ద్వారా రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. ఇప్పుడు హైదరాబాద్‌ను ఆంధ్రాలో కలిపేసి ఉమ్మడిగా ఉంచాలని అడిగితే బాగుంటుందా? అలా అయితే చేసేయమనండి తప్పు లేదు. రెండు తెలుగు రాష్ట్రాలను ఒకటిగా ఉంచమనండి. అభ్యంతరం లేదు’ అని బొత్స వ్యాఖ్యానించారు. ఏపీలో విలీనమైన మండలాలు, అందులోని ప్రజలు తమ ప్రభుత్వ కుటుంబసభ్యులేనన్నారు. వారి పూర్తి బాధ్యత తమదేనని చెప్పారు.

పువ్వాడ పక్క రాష్ట్రాల గురించి మాట్లాడటం తగదన్నారు. బాధ్యత గల ప్రభుత్వంగా.. వరదలను సమర్థంగా ఎదుర్కొన్నామని.. బాధితులకు అండగా నిలిచామన్నారు. పార్లమెంట్‌లో విలీన మండలాల అంశాన్ని తెలంగాణ తీసుకొస్తే.. తాము కూడా తెలుగు రాష్ట్రాలను కలిపేయాలని డిమాండ్‌ చేస్తామంటూ విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బొత్స బదులిచ్చారు.

అక్షరాస్యతలో ప్రథమ స్థానమే లక్ష్యం
విజయవాడ సత్యనారాయణపురంలోని ఏకేటీపీ మునిసిపల్‌ హైస్కూల్‌లో నిర్మించిన తరగతి గదులను మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ప్రారంభించారు. అలాగే విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో రూ.33.49 కోట్ల నిధులతో 28 ప్రభుత్వ పాఠశాలల్లో 168 అదనపు తరగతి గదుల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తున్నామన్నారు. అక్షరాస్యతలో ప్రథమ స్థానమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ చైర్మన్‌ పి.గౌతమ్‌రెడ్డి, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు