ఐటీ అధికారులుగా ఎలా నటించారంటే.. 

15 Jan, 2021 08:31 IST|Sakshi

ఉత్తరాదికి పారిపోయిన బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసు కీలక నిందితులు

అఖిలప్రియ అరెస్టు తర్వాత మిన్నకుండిపోయిన పోలీసులు

పుణే హోటల్‌ నుంచి త్రుటిలో తప్పించుకున్న గుంటూరు శ్రీను

సాక్షి, హైదరాబాద్‌: బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసు నిందితులు చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చి 9 రోజులైంది. పోలీసులు సూత్రధారిని అరెస్టు చేసినా ప్రధాన నిందితులను మాత్రం పట్టుకోలేకపోతున్నారు. పోలీసుల నుంచి త్రుటిలో తప్పించుకుంటూ చుక్కలు చూపిస్తున్నారు. ఈ నెల 5న అర్ధరాత్రి కిడ్నాప్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు సూత్రధారి భూమా అఖిలప్రియను అదుపులోకి తీసుకుని బాధితుల్ని విడిపించారు. ఆ తర్వాతి రోజే ఆమెను అరెస్టు చేశారు. అప్పటికే ఈ కేసులో ఆమె భర్త భార్గవ్‌రామ్, అనుచరుడు గుంటూరు శ్రీను కీలకంగా వ్యవహరించారని పోలీసులు గుర్తించారు. అయితే అఖిలప్రియ అరెస్టు తర్వాత మిగిలిన నిందితులు అంతా తమ అదుపులోనే ఉన్నట్లుగా పోలీసులు వ్యవహరించారు. మళ్ళీ ఆదివారం నుంచి వేగంగా స్పందించిన ప్రత్యేక బృందాలు ఆ మరుసటిరోజు అఖిలప్రియ పీఏ బోయ సంపత్, భార్గవ్‌రామ్‌ పీఏ నాగరదొడ్డి మల్లికార్జున్‌రెడ్డిలతోపాటు గుంటూరు శ్రీను అనుచరుడు డోర్లు బాల చెన్నయ్యలను పట్టుకున్నారు. చదవండి: ముగిసిన అఖిలప్రియ పోలీస్ కస్టడీ

ఈలోపు భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీను, అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత్‌రెడ్డి తదితరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసుల ఉదాసీనతలను తమకు అనుకూలంగా మార్చుకున్న ఈ నిందితులు ఉత్తరాదికి పారిపోయారు. నిందితులు అప్పటికే నేరచరిత్ర కలిగి ఉండటం, పోలీసుల దర్యాప్తు తీరుతెన్నులపై కొంత అవగాహన కలిగి ఉండటంతో ఎత్తులకు పైఎత్తులు వేస్తూ పారిపోయారు. భార్గవ్‌రామ్‌ బెంగళూరు నుంచి, గుంటూరు శ్రీను పుణే నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వీళ్లు బస చేసిన హోటళ్లపై పోలీసులు దాడి చేయడానికి కొద్దిసేపటి ముందే బయటకు జారుకున్నారు. వీరితోపాటు జగద్విఖ్యాత్‌రెడ్డి, చంద్రహాస్‌ తదితరుల కోసం హైదరాబాద్‌ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. చదవండి: అతడి‌ అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి

కిడ్నాప్‌ ఎలా జరిగిందంటే..
అఖిలప్రియ పోలీసు కస్టడీ బుధవారంతో ముగిసింది. మూడు రోజులపాటు ఈమెను విచారించిన బోయిన్‌పల్లి పోలీసులు అనేక కీలకాంశాలు రాబట్టారు. కిడ్నాప్‌ జరిగినరోజు బా ధితుల ఇంటికి భార్గవ్‌రామ్‌తోపాటు జగద్వి ఖ్యాత్‌రెడ్డి కూడా వెళ్లినట్లు తేలింది. అపహరణకు ముందు కూకట్‌పల్లిలో ఉన్న పార్థ గ్రాండ్‌ హోటల్‌లో భార్గవ్‌రామ్‌ మిగిలిన నిందితులతో సమావేశం ఏర్పాటు చేశాడు. అక్కడ నుంచి వారిని యూసుఫ్‌గూడలోని ఎంజీఎం ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు తీసుకువచ్చారు. అక్కడి ప్రొజెక్టర్‌లో గ్యాంగ్, స్పెషల్‌ 26 సినిమాల్లోని కొన్ని సీన్స్‌ ప్రదర్శించారు. ఐటీ అధికారులుగా ఎలా నటించాలనేది ఆ సీన్ల ద్వారా చూపించారు. అక్కడే అద్దెకు తెచ్చిన పోలీసు దుస్తులు, కొత్తగా ఖరీదు చేసిన ఫార్మల్‌ డ్రెస్సులను నిందితులు ధరించారు. అక్కడ నుంచి బోయిన్‌పల్లి వరకు భార్గవ్‌రామ్, జగద్విఖ్యాత్‌రెడ్డి ఒకే వాహనంలో ప్రయాణించారు. కిడ్నాప్‌ జరిగిన తర్వాత నేరుగా మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు చేరుకున్న భార్గవ్‌ అక్కడే బాధితులతో సంతకాలు చేయించాడు. ఈ కేసులో మొత్తం30 మంది ప్రమేయముందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశారు. మరో పది మంది అదుపులో ఉండగా మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు