గొర్రెల కాపరిగా మారిన బాలుడు.. ఆదరించిన చైల్డ్‌ లైన్‌

16 Nov, 2021 10:41 IST|Sakshi

తల్లి ఒత్తిడితో గొర్రెల కాపరిగా మారిన బాలుడు 

ఇష్టం లేకున్నా.. కష్టంగా ఏడాది పాటు పని చేసిన వైనం 

ఇక భరించలేక మంగళగిరి నుంచి పారిపోయి విజయవాడ చేరిక  

చేరదీసి బడికి పంపే ఏర్పాట్లలో చైల్డ్‌లైన్‌  

సాక్షి, అమరావతి: ఆమె పేరు బండారు దుర్గ. గుంటూరు జిల్లా మంగళగిరి ప్రకాశ్‌నగర్‌లో నివాసం ఉంటుంది. కట్టుకున్న భర్త కాదని వదిలి వెళ్లిపోయాడు. పేదరికంతో ఆమెకు కుటుంబ పోషణ భారమైంది. ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ పిల్లల కడుపు నింపాల్సిన పరిస్థితి. ఇక కొడుకులను చదివించడం తలకు మించిన భారమే అయ్యింది.. ఆపై కరోనా దెబ్బకు పరిస్థితి మరింత దిగజారింది. పూట గడవక ఐదో తరగతి చదువుతున్న పెద్ద కొడుకు అజయ్‌ని చదువు మాన్పించి గొర్రెల కాపరిగా పెట్టింది. ఏడాదికి రూ.30 వేలు తీసుకునే ఒప్పందంతో గొర్రెల యజమానికి అప్పగించింది.  

తల్లి కష్టాలను చూడలేక.. 
తల్లి కష్టాలను చూడలేని ఆ చిన్నారి పన్నెండేళ్ల వయసులో అయిష్టంగానే గొర్రెల కాపలాకు వెళ్లాడు. ఒప్పందం ప్రకారం రాత్రి వేళ కంటిమీద కునుకులేకుండా వాటికి కాపలాగా ఉండేవాడు. ఎప్పుడైనా కునుకు తీస్తే యజమాని కర్రలతో కొట్టే దెబ్బలను భరిస్తూ వచ్చాడు. ఊహ తెలియని వయసులో పాములు, పుట్టల మధ్య పగలూ, రాత్రి భయం భయంగా గడిపేవాడు. చదువుకు దూరమైపోతున్నానని తనలో తానే బాధపడేవాడు.  

చదువు కోవాలనే ఆరాటం.. 
చిన్నప్పట్నుంచి చదువు కోసం తపించే అజయ్‌.. తన తల్లి కోసం అన్నిటినీ భరించాడు. కానీ ఆ కష్టాలను, యజమాని కొట్టే దెబ్బలను తట్టుకోలేక ఇటీవల అక్కడ నుంచి రహస్యంగా పారి పోయి వచ్చేశాడు. మంగళగిరి రోడ్డెక్కి ఆటోలో విజయవాడ వచ్చి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. 

ఆదరించిన చైల్డ్‌ లైన్‌..
ఆకలితో అలమటిస్తున్న అజయ్‌ని చూసి రైల్వేస్టేషన్‌లోని చైల్డ్‌లైన్‌ సంస్థ ప్రతినిధులు చేరదీశారు. అజయ్‌ పూర్వాపరాలు ఆరా తీశారు. అప్పట్నుంచి తమ సంరక్షణలోనే ఉంచుకున్నారు. ఏదైనా మంచి స్కూలులో చేర్పించి అజయ్‌ విద్యా బోధన కొనసాగించే ప్రయత్నాల్లో వీరు ఉన్నారు.

దేశ సేవ చేస్తా.. 
చదుకోవడమంటే నాకు చిన్నప్పట్నుంచి ఇష్టం. కానీ ఇంట్లో పరిస్థితులు అనుకూలించలేదు. అయిష్టంగానే అమ్మ చెప్పినట్టు గొర్రెల కాపరిగా వెళ్లా. అక్కడ భయం భయంగా గడిపాను. కాపరిగా ఉంటే ఇక నా పరిస్థితి ఇంతే అనుకున్నాను. ఎలాగైనా అక్కడ నుంచి బయట పడి చదువుకోవాలన్న ఆశతో అమ్మకు కూడా చెప్పకుండా పారిపోయి విజయవాడ వచ్చేశా. ఇంటికి వెళ్తే మళ్లీ గొర్రెల యజమానికి అప్పగిస్తారని, ఇక చదువుకోలేనని భయంగా ఉంది. ఇక్కడ చైల్డ్‌లైన్‌లో బాగా చూసుకుంటున్నారు. బడిలో చేర్పించి చదివిస్తామంటున్నారు. నాక్కావల్సింది అదే. బాగా చదువుకుని ఆర్మీలో చేరతా. దేశ సేవ చేస్తా.  
– బండారు అజయ్‌ 

అజయ్‌ను బడికి పంపుతాం..  
అజయ్‌ తల్లిని పిలిపించాం. ఆమె బిడ్డ తమ సంరక్షణలో ఉన్నాడని చెప్పాం. వీలైనప్పుడల్లా కొడుకును చూసి వెళ్తోంది. అజయ్‌ చదువుకోవడానికే తప్ప తిరిగి ఇంటికి వెళ్లడానికి ఇష్టపడడం లేదు. అజయ్‌ కోరిక మేరకు చదువు కొనసాగిస్తాం. భవానీపురంలో ఉన్న ఎస్‌కేసీవీ చిల్డ్రన్‌ ట్రస్ట్‌ నడుపుతున్న స్కూల్లో చేర్పించే ప్రయత్నం చేస్తున్నాం. నిబంధనల ప్రకారం అజయ్‌ విషయాన్ని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ, జిల్లా ప్రొబేషనరీ ఆఫీసర్‌ దృష్టికి తీసుకెళ్లాం.  
– అరవ రమేష్, జిల్లా కోఆర్డినేటర్, చైల్డ్‌లైన్, విజయవాడ  

మరిన్ని వార్తలు