అయ్యో బిడ్డా: దూసుకొచ్చిన మృత్యువు

12 Apr, 2021 08:27 IST|Sakshi

పొక్లయిన్‌ ఢీకొని బాలుడు మృతి  

జి.కొండూరు(మైలవరం): పొట్ట చేత పట్టుకుని ఊరు కాని ఊరు వచ్చారు.. తమలాగా తమ బిడ్డలు కాకూడదనీ అహోరాత్రులు కష్టపడుతున్నారు. బిడ్డల భవిష్యత్‌ ఉజ్వలంగా ఉండాలని శ్రమిస్తున్నారు. అయితే వారి ఆశలు సమాధి అయ్యాయి. పొక్లయిన్‌ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారి ముద్దుల చిన్నారిని ఛిదిమేసింది. ఆ వలస కూలీ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. జి.కొండూరు మండల పరిధిలోని కుంటముక్కల గ్రామ శివారులో నిర్వహిస్తున్న ఇటుక బట్టీల వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.  వివరాలు ఇలా ఉన్నాయి..

చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం, దుర్గు జిల్లా, మెడిసెర గ్రామానికి చెందిన గోపాల్‌ప్రసాద్‌ జోషి తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి జనవరిలో కుంటముక్కల గ్రామానికి చెందిన కొంపల్లి మోహన్‌రావుకు చెందిన ఇటుక బట్టీలలో పనిచేసేందుకు వచ్చారు. కాగా ఆదివారం ఉదయం గోపాలప్రసాద్‌ కుటుంబ సభ్యులు ఇటుకలు తయారు చేసే పనిలో నిమగ్నమై ఉండగా సమీపంలో ఉన్న ఇంటి నుంచి గోపాల్‌ప్రసాద్‌ రెండో కుమారుడు నిఖిల్‌ కుమార్‌జోషి(5) ఆడుకుంటూ బయటకు వచ్చాడు. అదే సమయంలో పొక్లయిన్‌ వేగంగా వచ్చి నిఖిల్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి:
సినిమా తరహా పక్కా స్కెచ్‌: అనాథగా అవతారమెత్తి.. 
టీడీపీ నేత దాష్టీకం: తన్ని.. మెడపట్టి గెంటి..

మరిన్ని వార్తలు