విషాదం: అమ్మమ్మా.. ఎంతపని చేశావ్‌!

11 Jun, 2021 07:54 IST|Sakshi
నన్నెవరు చేరదీస్తారంటూ ఎదురుచూస్తున్న సాయిచరణ్‌

ఉన్న ఒక్క దిక్కునూ తీసుకుపోయిన కరోనా

పదేళ్ల ప్రాయంలో అయినవాళ్లందరూ దూరం 

అమలాపురం టౌన్‌: రెండేళ్ల వయస్సులో తండ్రి మరణం.. మూడేళ్ల వయసులో తల్లి వేరే పెళ్లితో దూరం..అమ్మమ్మ పెంపకంతో జీవనం... ఇప్పుడు ఆ ఒక్క ఆసరాగా ఉన్న అమ్మమ్మ కరోనాతో మరణం... అయినవాళ్లు ఉన్నా ఎవరూ తనను సాకేందుకు ముందుకు రాకపోవడం...నేను ఇక అనాథగా మిగిలిపోతానా... నన్నెవరూ చేరదీయరా...అంటూ ఆ పదేళ్ల బాలుడు పడుతున్న మనోవేదన వర్ణనాతీతం. అమలాపురం మైపాలవీధికి చెందిన సంకు సాయిచరణ్‌ రెండో ఏటే అతని తండ్రి అనారోగ్యంతో మృత్యువాత పడ్డాడు. దీంతో తల్లి, అన్న, అతను దిక్కులేని వారయ్యారు.

ఆ కుటుంబం అమలాపురంలోని అమ్మమ్మ సూర్యవతి ఇంటికి చేరుకుంది. అన్నయ్యను బంధువులు దత్తత తీసుకున్నారు. అమ్మమ్మ పెద్ద మనసుతో ఆలోచించి తన కూతురికి వేరే పెళ్లి చేసి పంపించేసి, సాయిచరణ్‌ను తనే పెంచుకోవాలనుకుంది. అనుకున్నట్టుగానే ఏడేళ్ల కిందట అమ్మమ్మ.. సాయిచరణ్‌ అమ్మకు ఖమ్మం జిల్లా సింగరేణి ప్రాంతానికి చెందిన అప్పటికే భార్య చనిపోయిన వ్యక్తికి రెండో పెళ్లి చేసి సాగనంపింది. అప్పటి నుంచి మనవడు సాయిచరణ్‌ను చదివిస్తూ అల్లా రు ముద్దుగా చూస్తోంది. గత నెలలో అమ్మమ్మ సూర్యావతికి కరోనా సోకి మృత్యువాత పడింది. వేరే పెళ్లితో అప్పడు వెళ్లిన అమ్మ, సూర్యావతి కుమారులు కలిసి ఆమె అంత్యక్రియలు ముగించారు.  కొద్దిరోజులకు సాయిచరణ్‌కు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. 
సాయిచరణ్‌ను ఎవరు

పెంచాలన్నదే ప్రశ్నార్థకం? 
అమ్మమ్మ దిన కార్యక్రమం ఆమె రక్త సంబంధీకులంతా ఏ లోటూ లేకుండా పూర్తి చేశారు. అయితే సాయి చరణ్‌ను ఇక నుంచి ఎవరు పెంచాలనే ప్రశ్న తలెత్తింది. సాయిచరణ్‌కు తల్లిగా ఆమె తీసుకుని వెళితే బాగుంటుందని అమలాపురంలోని వారి బంధువులు ఒకే మాటగా చెప్పారు. అయి తే సాయిచరణ్‌ తల్లి, ఆమె భర్త మాత్రం అతని బాగోగులు బయట నుంచి మేమూ చూస్తూ ఉంటాం. అతడిని అమలాపురంలోని బంధువులే చేరదీసి పెంచాలని కోరుతున్నారు. బుధ, గురువారాల్లో అమలాపురంలోని ఆ కుటుంబాల పెద్దలు ఇరు పక్షాలతో చర్చించినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో నేనెవరికీ వద్దా... నన్నెవరూ తీసుకు వెళ్లరా..అంటూ సాయిచరణ్‌ మౌనంగా రోదిస్తున్నాడు.

చదవండి: ఆధార్‌ లేకున్నా టీకా   
మరణించి.. నలుగురిలో జీవించి..

మరిన్ని వార్తలు