బాబూ శ్రీరామ్‌.. మా నాన్న ఇన్ని రోజులకు గుర్తుకొచ్చాడా?: బోయ రామాంజనమ్మ

21 Sep, 2022 09:32 IST|Sakshi

రాప్తాడు రూరల్‌: ‘బాబూ శ్రీరామ్‌.. మా నాన్న ఇన్ని రోజులకు గుర్తుకొచ్చాడా?’ అని పరిటాల శ్రీరామ్‌ను కనగానపల్లి మండలం తగరకుంట గ్రామానికి చెందిన బోయ రామాంజనేయులు కూతురు రామాంజనమ్మ ప్రశ్నించారు. పరిటాల శ్రీరాములుకు కుడి భుజంగా ఉన్న తన తండ్రి బోయ రామాంజనేయులు అప్పట్లో పరిటాల శ్రీరాములుతో పాటు హత్యకు గురైన వైనాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. 

మంగళవారం తాను మాట్లాడిన వీడియో సందేశాన్ని ఆమె పత్రికలకు విడుదల చేశారు. సందేశంలోని అంశం ఆమె మాటల్లోనే... ‘మీ నాన్న పరిటాల రవీంద్ర,  మీ అమ్మ పరిటాల సునీత మంత్రులుగా పని చేసిన సమయంలో తగరకుంట రామాంజనేయులు కుటుంబం మీకు గుర్తుకు రాలేదా? మీ తాత పరిటాల శ్రీరాములు కోసం మా నాన్న బోయ రామాంజనేయులు 1975లో ప్రాణాలిచ్చాడు. బాబూ శ్రీరామ్‌... మీ తాత కోసం మానాన్న  ప్రాణాలిచ్చాడని ఈ రోజు గుర్తించావా? ఇన్నేళ్లలో ఈ మాట ఎప్పుడైనా చెప్పావా?  ఏ రోజైనా మా గురించి ఆలోచించావా? మమ్మల్ని పకలరించావా? మాకేమైనా సాయం చేశావా? మా నాన్న చనిపోయినప్పుడు నేను అమ్మ కడుపులో ఉన్నా. నాకు జన్మనిచ్చిన తర్వాత మా అమ్మ ఎన్ని కష్టాలు ఎదుర్కొందో మాకు తెలుసు. ఈ రోజు మీ స్థాయి ఎలా ఉందో... మాస్థాయి ఎలా ఉందో ఆలోచించు. 

మమ్మల్ని గుర్తించింది ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఒక్కరే. ఆయన ఎంతో సాయమందించారు. భూమి ఇప్పించారు. బోరు వేయించారు. ఈ రోజు ప్రకా‹Ùరెడ్డి అన్న రూ. 500 కోట్లు సంపాదించాడని అంటున్నావు. మీ తాత ఉన్నప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో జనాలకు తెలుసు. నువ్వు అక్రమంగా ఎంత సంపాదించావో, ప్రకాశ్‌రెడ్డి ఎంత సంపాదించారో ప్రజలకు తెలుసు.  మీ నాన్న, మీ అమ్మ మంత్రులుగా పని చేశారు.

బోయ కులస్తులను గుర్తించి ఏ ఒక్క పదవైనా ఇచ్చారా? తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బోయ కులస్తులను గుర్తించి అనేక పదవులు ఇచ్చి ప్రాధాన్యత ఇస్తున్నారు. మీ సొంత మండలం రామగిరిలో బోయ కులస్తులకు మీరు ఎన్ని పదవులు ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎంతమందిని బెదిరించి ఎంత సంపాదించావో అందరికీ తెలుసు. మీ అవినీతి అంతా ప్రజలకు తెలుసు’ అని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు