జేఈఈ మెయిన్‌ తొలి విడతలో బాలుర హవా 

8 Feb, 2023 02:46 IST|Sakshi

100 స్కోర్‌ పాయింట్లు సాధించిన 20 మందీ బాలురే 

వీరిలో సగం వరకు తెలుగు రాష్ట్రాల నుంచి పరీక్ష రాసినవారే  

తొలి సెషన్‌ ఫలితాలు విడుదల చేసిన ఎన్‌టీఏ.. తొలి విడతకు 8.60 లక్షల మంది హాజరు 

రెండో సెషన్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం.. ఏప్రిల్‌ 6 నుంచి 12 వరకు రెండో విడత పరీక్షలు 

సాక్షి, అమరావతి: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌ తొలివిడత పరీక్షల ఫలితాల్లో బాలురు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 100 స్కోర్‌ పాయింట్లు సాధించిన 20 మందీ బాలురే కావడం గమనార్హం. 100 స్కోర్‌ పాయింట్లతో పాటు ఆ తర్వాత అత్యధిక స్కోర్‌ పాయింట్లు సాధించిన విద్యార్థుల్లో సగం మంది వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పరీక్షలకు హాజరైనవారేనని గణాంకాలు చెబుతున్నాయి.

ఈ మేరకు జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షల ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మంగళవారం విడుదల చేసింది. విద్యార్థుల మార్కుల ఆధారంగా స్కోర్‌ పాయింట్లతో ఈ ఫలితాలను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి వావిలాల చిద్విలాసరెడ్డి, దుగ్గినేని వెంకట యుగేష్, గుత్తికొండ అభిరామ్, బిక్కిన అభినవ్‌ చౌదరి, ఎన్‌కే విశ్వజిత్, అభినీత్‌ మాజేటిలు 100 స్కోర్‌ పాయింట్లు సాధించినవారిలో ఉన్నారు. జనరల్‌లో 14 మంది, ఓబీసీల్లో నలుగురు, జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌లో ఒకరు, ఎస్సీల్లో ఒకరు 100 స్కోర్‌ పాయింట్లు సాధించారు. 
 
బాలికల్లో టాప్‌ తెలుగు అమ్మాయిలే.. 
కాగా 100 స్కోర్‌ పాయింట్లు తర్వాత మంచి పాయింట్లు సాధించినవారిలో బాలికలు నిలిచారు. బాలికల విభాగం.. టాప్‌ టెన్‌లో 99.99 నుంచి 99.97 స్కోర్‌ పాయింట్లు సాధించిన పది మంది పేర్లను ఎన్‌టీఏ ప్రకటించింది. వారిలో టాప్‌లో మీసాల ప్రణీతి శ్రీజ, రామిరెడ్డి మేఘన, మేథా భవానీ గిరీష్, సీమల వర్ష, అయ్యాలపు రితిక, పీలా తేజ శ్రీ, వాకా శ్రీవర్షిత, గరిమా కల్రా, గున్‌వీన్‌ గిల్, వాణి గుప్తా ఉన్నారు. వీరిలో తెలుగు అమ్మాయిలే అధికం కావడం విశేషం.  
 
ఇక ఓబీసీ కేటగిరీలో బావురుపూడి రిత్విక్, ఈడబ్ల్యూఎస్‌లో మల్పాని తుషార్, దుంపల ఫణీంద్రనాధరెడ్డి, పెందుర్తి నిశ్చల్‌ సుభాష్, ఎస్సీ కేటగిరీలో కొమరాపు వివేక్‌ వర్థన్, ఎస్టీల్లో ధీరావత్‌ తనూజ్, ఉద్యావత్‌ సాయి లిఖిత్, దివ్యాంగుల్లో బి.శశాంక్, తుమ్మల తిలోక్‌లున్నారు.  
 
రెండో విడత దరఖాస్తులకు మార్చి 7 చివరి తేదీ.. 

జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు తొలి విడత జేఈఈ మెయిన్‌ పరీక్షలు నిర్వహించారు. బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పేపర్‌–1కు 8,60,064 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 8,23,967 (95.80 శాతం) మంది పేపర్‌–1 రాశారు. అలాగే బీఆర్క్, బీప్లానింగ్‌ కోర్సులకు ఉద్దేశించిన పేపర్‌–2కు 46,465 మంది దరఖాస్తు చేశారు. పేపర్‌–2ను 95 శాతానికి పైగా రాశారు.

ఇంగ్లిష్‌తోపాటు హిందీ, తెలుగుతోపాటు పలు ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసుకునే అవకాశం కల్పించారు. కాగా జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ పరీక్షలు ఏప్రిల్‌ 6 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు మంగళవారం (ఫిబ్రవరి 7) నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆరంభమైంది. మార్చి 7 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి నాలుగో వారంలో అభ్యర్థుల అడ్మిట్‌ కార్డులను విడుదల చేయనున్నారు. 

మరిన్ని వార్తలు