బ్రహ్మంగారి మఠంపై తేలని నిర్ణయం 

23 Jun, 2021 04:38 IST|Sakshi
బ్రహ్మంగారి మఠం

పీఠాధిపతి పెద్దభార్య కుమారులు, పినతల్లి మధ్య చర్చలు విఫలం 

పీఠాధిపత్యం తనకు.. కాకపోతే పెద్దభార్య రెండో కుమారుడికి దక్కాలన్న మహాలక్షుమ్మ 

మంత్రి, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు చర్చలు జరిపామన్న పెద్దభార్య కుమారులు 

బ్రహ్మంగారిమఠం/వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): వైఎస్సార్‌ జిల్లాలోని శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మఠం నూతన పీఠాధిపతి నియామకం విషయమై కుటుంబసభ్యుల మధ్య మంగళవారం జరిగిన చర్చలు ఫలించలేదు. చర్చలకు సంబంధించిన వివరాలను శివైక్యం చెందిన పీఠాధిపతి వీరభోగ వసంతవేంకటేశ్వరస్వామి పెద్దకుమారుడు వెంకటాద్రిస్వామి ‘సాక్షి’కి వివరించారు. దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్‌.రఘురామిరెడ్డి ఆదేశాల మేరకు తమ పినతల్లితో తాను, తన సోదరులు పీఠాధిపత్యంపై మాట్లాడినట్లు చెప్పారు. తమ పినతల్లి మారుతీ మహాలక్షుమ్మ మాత్రం పీఠాధిపత్యం ఆమెకే కావాలని తేల్చిచెప్పారన్నారు. ఒకవేళ లేదంటే పెద్దభార్య రెండో కుమారుడు వీరభద్రయ్యకు అప్పజెప్పాలని సూచించారన్నారు.

పెద్దకుమారుడినైన తనకు కావాలంటే బ్రహ్మంగారి గురించి ప్రచారం చేసేందుకు అనుమతి కల్పిస్తామని చెప్పారన్నారు. ‘ఇంతకుముందు మీ పెద్దకుమారుడికి పీఠాధిపత్యం కావాలన్నారు. ఇప్పుడేమో తెరపైకి మా రెండో తమ్ముడి పేరు ప్రతిపాదిస్తున్నారు. అసలు పీఠాధిపతి కుమారులు అనర్హులు అయినందువల్లే.. పీఠాధిపతి రెండో వివాహం చేసుకున్నారు. తన పిల్లలకు మాత్రమే పీఠాధిపత్యం కావాలని వీలునామా కూడా రాశారు అని గతంలో చెప్పారు కదా..’ అని తమ పినతల్లిని అడిగినట్లు తెలిపారు. దీనిపై తమ పినతల్లి స్పందిస్తూ ‘అది అప్పటిమాట. ఇప్పుడు నాకు రాకపోయినా వీరభద్రయ్యకు రావాలి’ అని చెప్పారన్నారు. లేనిపక్షంలో కోర్టునైనా ఆశ్రయిస్తానని ఆమె పేర్కొన్నట్లు తెలిపారు. తాను మాత్రం దేవదాయశాఖ ఆదేశాల మేరకు నడుచుకుంటానని ఆయన స్పష్టం చేశారు. 

సంప్రదాయాన్ని అమలు చేయాలని సూచించాం: శివస్వామి 
బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి వ్యవహారంలో సంప్రదాయాలను, హిందూధర్మాన్ని అనుసరించి నిర్ణయం తీసుకోవాలని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు సూచించినట్లు శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి చెప్పారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును ఆయన క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలిసిన శివస్వామి మఠం పీఠాధిపతి వ్యవహారంపై రెండో నివేదికను అందజేశారు. అనంతరం శివస్వామి మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మంగారి వారసులు, పలు పీఠాధిపతులు, విశ్వబ్రాహ్మణ సంఘాల వారు, కందిమల్లయ్యపల్లి గ్రామస్తులు, ఉపమఠాల వారి అభిప్రాయాలు, సూచనలతో విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక పక్షాన మంత్రికి రెండో నివేదికను ఇచ్చినట్లు తెలిపారు. హిందూధర్మం, శాస్త్రాలు, పెద్దల మనోభావాల మేరకు పెద్ద కుమారుడికే పీఠాధిపత్యం దక్కాలని సూచించామన్నారు. త్వరలోనే ఈ వివాదాన్ని పరిష్కరిస్తామని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారన్నారు.   

మరిన్ని వార్తలు