‘బిగ్‌బాస్‌’ షో చూపిస్తూ బ్రెయిన్‌ ఆపరేషన్‌

21 Nov, 2020 09:11 IST|Sakshi

రోగి మెలుకువగా ఉండగానే ఆపరేషన్‌

గుంటూరు : బిగ్‌బాస్‌ రియాల్టీ షోను రోగికి చూపిస్తూ, రోగి హీరో నాగార్జున పాటలు పాడుతున్న సమయంలో బ్రెయిన్‌ ఆపరేషన్‌ చేశారు. రోగికి అత్యాధునిక వైద్య విధానం న్యూరో నావిగేషన్‌తో  అవేక్‌ బ్రెయిన్‌ సర్జరీ చేసి ప్రాణాలు కాపాడినట్టు ప్రముఖ న్యూరోసర్జన్‌ డాక్టర్‌ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి చెప్పారు. గుంటూరు కొత్తపేటలోని బ్రింద న్యూరోసెంటర్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.  పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామానికి చెందిన 33 ఏళ్ల బత్తుల వరప్రసాద్‌ బెంగళూరులో స్టాఫ్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. తలలో ట్యూమర్‌ ఏర్పడి ఫిట్స్‌ రావటంతో 2016లో హైదరాబాద్‌లో ఆపరేషన్‌ చేయించుకున్నారు. సర్జరీ అనంతరం రేడియోథెరపీ కూడా చేశారు. అయితే  బ్రెయిన్‌లో మరలా గడ్డ ఏర్పడి సుమారు ఆరు నెలలుగా ఫిట్స్‌ వచ్చి తరచుగా పడిపోతున్నాడు.

క్యాన్సర్‌ వైద్య నిపుణుల సూచనల మేరకు నవంబర్‌ 6న రోగి తమ ఆస్పత్రికి  వచ్చాడని చెప్పారు. రోగి తలకు ఎంఆర్‌ స్పెక్ట్రో స్కోపీ, పర్‌ఫ్యూజన్‌ స్కాన్‌ చేసి ప్రధానమైన పెద్ద రక్తనాళం పక్కన ప్రీ మోటార్‌ ప్రాంతంలో ట్యూమర్‌ ఉన్నట్టు గుర్తించామన్నారు. ఈ నెల 10న న్యూరో నావిగేషన్, మోడరన్‌ మైక్రోస్కోప్‌  వినియోగించి త్రీడీ టెక్నాలజీ ద్వారా ఆపరేషన్‌ చేసినట్లు వివరించారు. ఆపరేషన్‌  సమయంలో రోగికి బిగ్‌బాస్‌ షో చూపిస్తూ ఉండగా హీరో నాగార్జున పాటలను రోగి పాడుతూ ఉన్నట్టు తెలిపారు. తదుపరి రోగికి ఇష్టమైన అవతార్‌ సినిమాను చూపిస్తూ, రోగితో మాట్లాడుతూ ఆపరేషన్‌ చేశామన్నారు.

బ్రెయిన్‌లో నుంచి మూడు సెంటీమీటర్ల ట్యూమర్‌ను తీసే సమయంలో వరప్రసాద్‌ తన మెడ వెనుక ఏదో తేడా వస్తున్నట్టు చెప్పాడన్నారు. వెంటనే వేరే డైరెక్షన్‌లో బ్రెయిన్‌లో నుంచి ట్యూమర్‌ను బయటకు తీసి రోగి ప్రాణాలు కాపాడామన్నారు. సుమారు గంటన్నర వ్యవధిలో జరిగిన శస్త్రచికిత్సలో తనతో పాటుగా సీనియర్‌ న్యూరోసర్జన్‌ డాక్టర్‌ డి.శేషాద్రిశేఖర్, మత్తు వైద్యనిపుణుడు డాక్టర్‌ బి.త్రినాథ్‌ పాల్గొన్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అవేక్‌ బ్రెయిన్‌ సర్జరీ తామే మొట్టమొదటిసారిగా చేశామని చెప్పారు. 

మరిన్ని వార్తలు