మెదడు గురించీ ఆలోచించాలి..బ్రెయిన్‌ స్ట్రోక్‌కు కారణాలు

6 Dec, 2021 04:14 IST|Sakshi

జీవనశైలి మార్పు, దురలవాట్ల కారణంగా మధ్య వయసు వారికీ బ్రెయిన్‌ స్ట్రోక్‌

బీపీ, షుగర్‌ నియంత్రణలో లేకపోవడం కూడా కారణం

కరోనా వచ్చి కోలుకున్న 5 శాతం మందిలో లక్షణాలు

ప్రజల్లో సరైన అవగాహనలేక పెరుగుతున్న కేసులు

స్ట్రోక్‌ వచ్చిన మూడు గంటల్లో ఆస్పత్రికి వస్తే వైకల్యం రాకుండా వైద్యం

సాక్షి, అమరావతి: గుంటూరు నగరానికి చెందిన 26 ఏళ్ల యువకుడు ఓ ప్రైవేట్‌ షోరూమ్‌లో పనిచేస్తుంటాడు. ఇతనికి రెండు నెలల క్రితం మూతి వంకరపోవడంతో కుటుంబ సభ్యులు జీజీహెచ్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం బ్రెయిన్‌ స్ట్రోక్‌ (పక్షవాతం)గా నిర్ధారణ అయింది. డిగ్రీ చదివే రోజుల నుంచే సురేశ్‌ సిగరెట్లు తాగేవాడు. రోజులు గడిచే కొద్దీ చైన్‌ స్మోకర్‌గా మారాడు. చిన్న వయసులోనే స్ట్రోక్‌కు గురికావడానికి పొగతాగడమే కారణంగా వైద్యులు గుర్తించారు. 

విశాఖపట్నం నగరానికి చెందిన 30 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కరోనా కారణంగా గత ఏడాదిగా ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. రెండు వారాల క్రితం ఇంట్లో పనిచేస్తూ స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు కేజీహెచ్‌కు తరలించగా వైద్య పరీక్షల అనంతరం బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయినట్టుగా వైద్యులు నిర్ధారించారు. తీవ్రమైన పని ఒత్తిడితో, నిద్రలేమి వంటి సమస్యల వల్ల స్ట్రోక్‌ వచ్చినట్టుగా గుర్తించారు. 

ఆలోచనల ఒత్తిడితో సతమతమయ్యే మెదడు గురించి కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆధునిక జీవన శైలి, దురలవాట్ల కారణంగా 20 నుంచి 45 ఏళ్ల మధ్య వయసులో కొందరు బ్రెయిన్‌ స్ట్రోక్‌ బారిన పడుతున్నారు. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడిన వారిలో బీపీ, షుగర్‌ నియంత్రణలో లేకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుండేది. అయితే ప్రస్తుతం నమోదవుతున్న 25 నుంచి 30 శాతం బ్రెయిన్‌ స్ట్రోక్‌ కేసుల్లో వ్యక్తుల వయసు 20 నుంచి 45 ఏళ్ల లోపు ఉంటోందని వైద్యులు చెబుతున్నారు.  

బ్రెయిన్‌ స్ట్రోక్‌కు కారణాలు..
► పొగతాగడం, మద్యం, గంజాయి, డ్రగ్స్‌ తీసుకోవడం. మద్యపానం, ధూమపానం అలవాటైన పదేళ్లకే పలువురిలో బ్రెయిన్‌ స్ట్రోక్‌ లక్షణాలు కనబడుతున్నాయి. 
► బీపీ, షుగర్‌లు నియంత్రణలో లేకపోవడం. శారీరక శ్రమ లేకపోవడం. 
► మహిళలు నెలసరిని వాయిదా వేయడం. అధిక రక్తస్రావం నియంత్రణకు వైద్యుల సలహాలు తీసుకోకుండా మందులు వాడటం. 
► ప్రస్తుతం కరోనా బారినపడి కోలుకున్న వారిలో 5 శాతం మంది బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురవుతున్నారు. 

రాష్ట్రంలో బీపీ, షుగర్, ఊబకాయం పరిస్థితి ఇలా..
► మన రాష్ట్రంలో 30 ఏళ్లు నిండిన ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ, ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్‌ ఉంటోంది.
► గ్రామాల్లో 26 శాతం మంది, పట్టణాల్లో 30 శాతం మంది బీపీ బాధితులు, గ్రామాల్లో 19 శాతం మంది, పట్టణాల్లో 24 శాతం మంది షుగర్‌ బాధితులు. 
► జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ఆధారంగా రాష్ట్రంలో 36.3 శాతం మంది మహిళల్లో, 31.3 శాతం పురుషుల్లో ఊబకాయం ఉంది. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
► రోజూ 45 నిమిషాల నడకతో పాటు ఇతర వ్యాయామాలు చేయాలి.
► ఆహారంలో 25 శాతం పండ్లు, 30 శాతం కూరగాయలు, 25 శాతం పిండి పదార్థాలు, 20 శాతం ప్రొటీన్స్‌ ఉండేలా చూసుకోవాలి. జంక్‌ ఫుడ్‌ను పూర్తిగా నియంత్రించాలి.
► శరీర బరువును నియంత్రించుకోవాలి. బీపీ, షుగర్‌ వంటి సమస్యలు ఉంటే తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. 
► ఒత్తిడికి గురికాకుండా ఉండాలి. రోజుకు ఆరు గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి.

స్ట్రోక్‌ రెండు రకాలు
మెదడులోని రక్తనాళాల్లో రక్త ప్రసరణ సక్రమంగా లేకపోవడం వల్ల శరీరంలోని కొన్ని భాగాలు చచ్చుబడటాన్ని ఇస్కిమిక్‌ స్ట్రోక్‌ అంటారు. రక్తనాళాలు చిట్లినప్పుడు హెమరేజిక్‌ స్ట్రోక్‌ అంటారు. బీపీ, షుగర్, ఊబకాయం నియంత్రించుకోవడంపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల మన దేశంలో మధ్య వయసుల వారు స్ట్రోక్‌కు గురవ్వడం పెరుగుతోంది. కేజీహెచ్‌కు రోజుకు సగటున ఆరు కేసులు వస్తుంటాయి.    
– డాక్టర్‌ జి.బుచ్చిరాజు, న్యూరాలజీ విభాగాధిపతి, విశాఖ ఆంధ్ర మెడికల్‌ కళాశాల

మూడు గంటల్లోపు ఆస్పత్రికి వస్తే..
గుంటూరు జీజీహెచ్‌లో ప్రత్యేకంగా స్ట్రోక్‌ యూనిట్‌ ఉంది. గతేడాది 614 మంది, ఈ ఏడాది ఇప్పటి వరకూ 416 మంది స్ట్రోక్‌ బాధితులకు చికిత్స అందించాం. ఈ ఏడాది కరోనా చికిత్స కారణంగా మే నెలలో అడ్మిషన్‌లు లేవు. కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా చికిత్స ఉంటుంది.  స్ట్రోక్‌ వచ్చిన మూడు గంటల్లోపు రోగిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తే వైకల్యం లేకుండా చేయవచ్చు.     
    – డాక్టర్‌ కె. సుందరాచారి, న్యూరాలజీ విభాగాధిపతి, గుంటూరు మెడికల్‌ కళాశాల   

మరిన్ని వార్తలు