ప్రైవేట్‌ బస్సుల్లో అధిక చార్జీలకు బ్రేకులు 

13 Sep, 2020 05:10 IST|Sakshi

తొలుత విజయవాడ–హైదరాబాద్‌ రూట్‌లో రవాణా శాఖ తనిఖీలు 

ఏపీ నుంచి రోజూ 150 బస్సులు తిప్పుతున్న ప్రైవేట్‌ ఆపరేటర్లు 

సాక్షి, అమరావతి: ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు గత వారం రోజులుగా ప్రైవేట్‌ బస్సులు తిరుగుతున్నాయి. ప్రతి రోజూ 150 బస్సులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు వెళుతున్నాయి. ఈ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. తొలుత విజయవాడ–హైదరాబాద్‌ రూట్‌లో తనిఖీలకు శ్రీకారం చుట్టారు. 

► టీఎస్‌ ఆర్టీసీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంతర్రాష్ట్ర ఒప్పందం విషయంలో వెనక్కు తగ్గేది లేదని తెగేసి చెబుతోంది. దీంతో ఆర్టీసీ బస్సులు తిప్పే అంశంపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ వివాదం కొనసాగుతుండటం ప్రైవేట్‌ ఆపరేటర్లకు కలిసొచ్చింది.  
► ప్రతి రోజూ ఏపీ నుంచి హైదరాబాద్‌కు ప్రైవేటు బస్సుల్లో 4 వేల మంది వెళుతున్నారు. ప్రైవేట్‌ బస్సులే దిక్కు కావడంతో ప్రయాణికుల నుంచి అధిక రేట్లు వసూలు చేస్తున్నారు. 
► హైదరాబాద్‌ నుంచి విజయవాడకు స్లీపర్‌ క్లాస్‌ టికెట్‌ ధర రూ.1,200 వరకు వసూలు చేస్తున్నారు. అదే ఆర్టీసీలో రూ.800. 
► నాన్‌ ఏసీ టికెట్‌ ధర ఆర్టీసీలో రూ.400 వరకు ఉండగా, ప్రైవేట్‌ ఆపరేటర్లు రూ.700 నుంచి రూ.800 వరకు వసూలు చేస్తున్నారు. 
► మరోవైపు ట్రావెల్స్‌ నిర్వాహకులు క్వార్టర్లీ ట్యాక్స్‌ చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు.

అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు 
ప్రైవేట్‌ ట్రావెల్స్‌ కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగానే బస్సులు నడపాలి. ప్రయాణికుల అవసరాలను అవకాశంగా తీసుకుని అధిక రేట్లు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్‌–విజయవాడ రూట్‌లో తనిఖీలు చేపడుతున్నాం. 
– ప్రసాదరావు, రవాణా శాఖ అదనపు కమిషనర్‌  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు