Vizag Bride Death Case: నవ వధువు సృజన మృతి కేసులో ట్విస్ట్‌.. షాక్‌లో పేరెంట్స్‌, వరుడు

12 May, 2022 15:37 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగర శివారులోని మధురవాడ నగరం పాలెంలో బుధవారం రాత్రి కళ్యాణ మండపంలో నవ వధువు సృజన ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమెకు టెస్టులు నిర్వహించిన తర్వాత వైద్యులు రిపోర్టు అందించారు. ఈ రిపోర్టు అందిన తర్వాత పీఎం పాలెం సీఐ రవికుమార్‌ మాట్లాడుతూ.. సృజన పాయిజన్‌ తీసుకోవడం వల్లే చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారని తెలిపారు. అయితే, పాయిజన్‌ ఎందుకు తీసుకుంది అనే వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటనపై విశాఖ నార్త్‌ ఏసీపీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘‘సృజనది అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశాము. సృజన అన్‌నౌన్ పాయిజన్ తీసుకొని చనిపోయినట్లు ఇండస్ హాస్పిటల్ రిపోర్ట్ ఇచ్చింది. పోస్ట్ మార్టం రిపోర్టు నివేదిక వచ్చిన తరువాత పూర్తి వివరాలు తెలుస్తాయి. ఆమె బ్యాగులో గన్నేరు కాయల తొక్కు లభించింది. అది ఎలా వచ్చింది అన్న దానిపై కూడా విచారణ చేస్తున్నాము. ఇప్పటికే కొంతమందిని విచారించాం. సృజనా మృతిలో వాస్తవాలు తెలియాలంటే ఆమె తల్లిదండ్రులు కూడా వాస్తవాలు చెప్పాలి. సృజన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాము’’ అని అన్నారు.

అయితే, బుధవారం రాత్రి పెళ్లి సందర్భంగా నాగోతి శివాజీ, సృజనల వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. పండితులు వేద మంత్రాల మధ్య జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి సృజన పెళ్లి పీటలపై కుప్పకూలింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. అంతకు ముందు వధువు మృతిపై ఇరు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: ‘అసని’ తుపాను తెచ్చిన ‘బంగారు’ మందిరం

మరిన్ని వార్తలు