ముహూర్తం టైమ్‌కి వధువు మాయం.. 2 గంటల వ్యవధిలోనే

15 Nov, 2021 09:13 IST|Sakshi
పొలీసులను ఆశ్రయించిన సోనిక, చరణ్‌

ప్రియునితో పెళ్లి చేసుకున్న యువతి

పోలీసులను ఆశ్రయించిన పెళ్లికొడుకు, బంధువులు

మదనపల్లె టౌన్‌(చిత్తూరు జిల్లా): కొద్దిసేపటికి పీటలపై కూర్చొని వధువు మెడలో వరుడు తాళి కట్టాల్సి ఉంది. వధువు ముహూర్తపు దుస్తులు కట్టుకోవడానికి గదిలోకి వెళ్లింది. పెళ్లికూతురు అటు నుంచి అటే అదృశ్యమై, తన ప్రియుడితో వివాహం చేసుకున్న ఘటన మదనపల్లెలో చర్చనీయాంశమైంది. టూటౌన్‌ సీఐ నరసింహులు కథనం మేరకు.. మదనపల్లె మండలం తట్టివారిపల్లెకు చెందిన రామకృష్ణ, మల్లిక దంపతుల కుమార్తె సోనికకు పట్టణంలోని సొసైటీ కాలనీలో ఉంటున్న ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది.

శని, ఆదివారాల్లో పెళ్లి జరిగేలా పెద్దలు నెల రోజుల క్రితం పత్రిక రాయించుకున్నారు. శనివారం రాత్రి రిసెప్షన్‌ జరిగింది. ఆదివారం పెళ్లి మహూర్తానికి పెళ్లికూతురు, పెళ్లికొడుకుతోపాటు బంధువులు, మిత్రులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. 5.30 గంటలకు ముహూర్తం కాగా ఆ సమయానికి పెళ్లి చీర కట్టుకునేందుకు సోనిక గదిలోకి వెళ్లి తిరిగి రాకుండా పోయింది.

ఆదివారం ఉదయం గొల్లపల్లెకు చెందిన తన ప్రియుడు చరణ్‌తో పుంగనూరుకు వెళ్లి ఓ గుడిలో వివాహం చేసుకుంది. పెద్దలతో తనకు ప్రమాదం ఉందని మదనపల్లె టూటౌన్‌ పోలీసులను ఆశ్రయించింది. అయితే పెళ్లికొడుకు బంధువులు తాము పెళ్లి కోసం రూ.లక్షలు ఖర్చు పెట్టామని, తమకు అవమానం జరిగిందని పెద్దలతో కలిసి టూటౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. కాగా సోనిక ఎంబీఏ చదివి, స్థానిక గురుకుల పాఠశాలలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, గృహనిర్బంధం చేస్తున్నారని సోనిక ఇదివరకే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరిన్ని వార్తలు