పెళ్లింట విషాదం నింపిన రోడ్డు ప్రమాదం..  

13 Dec, 2022 05:17 IST|Sakshi

మామిడికుదురు: ఇంట్లో పెళ్లి జరిగిందన్న ఆనందంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులకు గంటల వ్యవధిలోనే ఆ ఆనందం ఒక్కసారిగా ఆవిరైంది. ఒక్కగానొక్క కుమార్తెను కన్యాదానం చేసి కల్యాణ మంటపం నుంచి ఇంటికి తిరిగివస్తున్న తండ్రిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. దీంతో పెళ్లి బాజాలు మోగిన ఆ ఇంట్లో ఆవేదన కట్టలు తెంచుకుంది. ఈ విషాద ఘటన పాశర్లపూడిలంక గ్రామంలో చోటు చేసుకుంది. 

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వధువు తండ్రి ముత్యాల శ్రీనివాసరావు (51) కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. అతని మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పాశర్లపూడిలంకకు చెందిన ముత్యాల శ్రీనివాసరావు కుమార్తె వనదుర్గవల్లీశ్రావణి వివాహం ఈ నెల 8వ తేదీ రాత్రి పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి ఫంక్షన్‌ హాల్‌లో జరిగింది. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత శ్రీనివాసరావు మోటార్‌ సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తూ పాశర్లపూడి కైకాలపేటలో 216వ నంబర్‌ జాతీయ రహదారిపై అదుపు తప్పి పడిపోయాడు. 

తీవ్రంగా గాయపడ్డ అతనిని కాకినాడలో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించడంతో జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృత్యువాత పడ్డాడు. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. భగవంతుడు తమ కుటుంబానికి తీరని అన్యాయం చేశాడని మృతుడి భార్య మంగ, నవ వధువు వనదుర్గవల్లీశ్రావణి, వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి సోదరుడు వీరవెంకట సత్యనారాయణ ఫిర్యాదు మేరకు నగరం హెచ్‌సీ కొండబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.    

మరిన్ని వార్తలు