పెళ్లిలో 53 తులాల నగలు మాయం..నిందితుడి అరెస్ట్

20 Jan, 2021 19:07 IST|Sakshi

సాక్షి, విశాఖ : రిసార్ట్‌లో నిర్వహించిన పెళ్లివేడుకలో జరిగిన చోరీ ఘటనను విశాఖ పోలీసులు చేధించారు. పెళ్లివేళ  వధువుకు చెందిన యాభై మూడు తులాల బంగారాన్ని   పాత నేరస్తుడే చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. విశాఖలోని ఓ రిసార్టులో మరికొద్ది సేపట్లో వివాహతంతు జరగాల్సి ఉండగా పెళ్లికూతురు నగలు మాయం కావడం కలకలం రేగిన సంగతి తెలిసిందే. వధువును అలకరించేందుకు సిద్ధం అవుతున్న తరుణంలో ఆభరణాలన్నీ మాయమవ్వడంతో పెళ్లికూతురు కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. అయితే పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు మాత్రం పెద్ద మనసు చేసుకొని నిరాడంబరంగానే పెళ్ళికి అంగీకరించారు. మొత్తానికి  పెళ్లయితే జరిగింది. విశాఖలోని  అనకాపల్లి మండలం మునగపాక గ్రామానికి చెందిన అలేఖ్యకు అదే గ్రామానికి చెందిన యువకుడితో డిసెంబర్ నెల 24వ తేదీన సాయి ప్రియ రిసార్ట్స్ లో వివాహం జరిపించేందుకు నిశ్చయించారు. పెళ్లికూతురు అలంకరించే సమయంలో చూస్తే 53 తులాల బంగారం మాయం అయ్యింది. దీంతో  అలేఖ్య కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  (ప్రేమోన్మాది ఢిల్లీబాబు ఆత్మహత్య)

పోలీసుల ప్రాథమిక విచారణలో రిసార్ట్‌లోని సీసీ ఫుటేజ్‌లో ఎలాంటి  దృశ్యాలు కనిపించలేదు కానీ రిసార్ట్స్ వెనక కిటికీ తొలగించి ఉన్నట్టు గుర్తించారు. దీంతో అటుగా దారితీసిన దాదాపు కిలోమీటరు దూరం సి సి ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు. ఈ పరిస్థితుల్లో దాదాపు 300 మందిని పోలీసులు విచారించగా కొంత క్లూ లభించింది. ఒడిస్సా కి చెందిన గంగాధర్ అనే పాత నేరస్తుడు సీసీ కెమెరా లో కనిపించడంతో అతన్ని విచారించారు. కోవిడ్‌ ముందు వరకు  విశాఖలోని హోటల్లో పని చేసిన గంగాధర్ ఉపాధి కోల్పోవడంతో దొంగతనాలు ప్రారంభించాడు.ఆ క్రమంలో సాయి ప్రియ రిసార్ట్స్ వద్ద రెక్కీ నిర్వహించి పెళ్లికూతురు అలేఖ్య కుటుంబానికి చెందిన యాభై మూడు తులాల బంగారాన్ని చోరీ చేశాడు. అందులో మూడు తులాల బంగారాన్ని వదిలిపెట్టి మిగతా బంగారాన్నంతా ఎత్తుకెళ్లాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి చోరీని చేధించారు. పెళ్లికూతురికి చెందిన 53 తులాల బంగారు ఆభరణాలు దొరకడంతో  ఇరువురి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (‘పింక్‌ డైమండ్‌’ పిల్‌ను తోసిపుచ్చిన హైకోర్టు)

మరిన్ని వార్తలు